U.S. Open : వరల్డ్ నం.1 స్వైటెక్‌కు షాక్.. క్వార్టర్స్‌లో ఇంటికి
ఆసక్తికరంగా సాగుతున్న యూఎస్ ఓపెన్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి.
దిశ, స్పోర్ట్స్ : ఆసక్తికరంగా సాగుతున్న యూఎస్ ఓపెన్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. టైటిల్ ఫేవరెట్స్ ఒక్కొక్కరుగా టోర్నీ నుంచి నిష్ర్కమిస్తున్నారు. తాజాగా ఉమెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్(పొలాండ్) జోరుకు బ్రేక్ పడింది. వరుసగా ఏకపక్ష విజయాలతో దూసుకెళ్తున్న ఆమెకు అమెరికా క్రీడాకారిణి జెస్సికా పెగులా షాకిచ్చింది. క్వార్టర్స్‌లో ఆమెను మట్టికరిపించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్వైటెక్ 2-6, 4-6 తేడాతో పెగులా చేతిలో పరాజయం పాలైంది. గంటా 28 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో పెగులా సంచలన ఆటతీరు కనబర్చింది. వరుస సెట్లలో టాప్ సీడ్‌కు షాకిచ్చి ఏ గ్రాండ్‌స్లామ్‌లోనైనా తొలిసారిగా సెమీస్‌కు చేరుకుంది. పెగులా 22 తప్పిదాలే చేయగా.. 41 తప్పిదాలతో స్వైటెక్ మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్స్‌కు ముందు స్వైటెక్ ఆడిన నాలుగు మ్యాచ్‌లను రెండు సెట్లను గెలుచుకుంది.
మెద్వెదెవ్‌కు షాకిచ్చి సెమీస్‌కు సిన్నర్
మెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.1 సిన్నర్(ఇటలీ) సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో గతేడాది ఫైనలిస్ట్ మెద్వెదెవ్(రష్యా)ను ఓడించాడు. నాలుగు సెట్లలో జరిగిన మ్యాచ్‌లో సిన్నర్ 6-2, 1-6, 6-1, 6-4 తేడాతో మెద్వెదెవ్‌ను చిత్తు చేశాడు. యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకోవడం సిన్నర్‌కు ఇదే మొదటిసారి. ఈ ఏడాది అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన విషయం తెలిసిందే. జకోవిచ్, అల్కరాజ్, తాజాగా మెద్వెదెవ్ ఇంటిదారిపట్టడంతో యూఎస్ ఓపెన్ టైటిల్ దక్కుంచుకునేందుకు సిన్నర్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.