US Open: ఒలింపిక్స్ చాంపియన్ జెంగ్ శుభారంభం.. రెండో రౌండ్‌కు క్వాలిఫై

పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, చైనా స్టార్ క్రీడాకారిణి జెంగ్ క్వినెన్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లో శుభారంభం చేసింది.

Update: 2024-08-26 18:25 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, చైనా స్టార్ క్రీడాకారిణి జెంగ్ క్వినెన్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఒలింపిక్స్‌ జోరును కొనసాగించిన ఆమె రెండో రౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో జెంగ్ 4-6, 6-4, 6-2 తేడాతో అన్‌సీడ్ ప్లేయర్, అమెరికాకు చెందిన అనిసిమోవాను ఓడించింది. రెండు గంటల 20 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో మొదట జెంగ్‌కు సరైన ఆరంభం దక్కలేదు. మొదటి సెట్‌లో ఆమెకు అమెరికా క్రీడాకారిణి షాకిచ్చింది. ఆ తర్వాత తడబాటు నుంచి జెంగ్ పుంజుకుంది. వరుసగా రెండు సెట్లను నెగ్గి మ్యాచ్‌ను దక్కించుకుంది. 12 ఏస్‌లు, 32 విన్నర్లతో చెలరేగిన జెంగ్ ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసింది. అనిసిమోవా 4 డబుల్ ఫౌల్ట్స్, 38 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

మరోవైపు, 9వ సీడ్, గ్రీస్ క్రీడాకారిణి మరియా సక్కరి తొలి రౌండ్‌లో గాయపడి టోర్నీ నుంచి తప్పుకుంది. 12వ సీడ్ డారియా కాసత్కినా, 24వ సీడ్ డోనా వెకిక్(క్రొయేషియా) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తొలి రౌండ్‌లో కాసత్కినా 6-2, 6-4 తేడాతో క్రిస్టియన్(రొమానియా)పై, వెకిక్ 6-4, 6-4 తేడాతో బిరెల్(ఆస్ట్రేలియా)పై విజయం సాధించి ముందుడగు వేశారు. మెన్స్ సింగిల్స్‌లో 2020 ఫైనలిస్ట్, 4వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో సహచర ఆటగాడు మార్టెరర్‌‌ను దాటడానికి కొద్దిగా శ్రమించాడు. నాలుగు సెట్లలో జరిగిన మ్యాచ్‌లో జ్వెరెవ్ 6-2, 6-7(5-7), 6-3, 6-2 తేడాతో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 

Tags:    

Similar News