US Open 2023 Women's Singles Final: యూఎస్‌ ఓపెన్‌లో దుమ్మురేపిన యువ సంచలనం.. 19 ఏళ్లకే తొలి గ్రాండ్​స్లామ్ టైటిల్

యూఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్‌కు కొత్త చాంపియన్ వచ్చింది.

Update: 2023-09-10 16:26 GMT

న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్‌కు కొత్త చాంపియన్ వచ్చింది. అమెరికా సంచలనం కోకో గాఫ్ నయా చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌లో 2వ సీడ్, సబలెంక‌ను ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకుంది. సొంతగడ్డపై అదరే ప్రదర్శన చేసిన గాఫ్.. 1999‌లో సెరెనా విలియమ్స్ తర్వాత మేజర్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తొలి అమెరికా టీనేజర్‌గా చరిత్ర సృష్టించింది. మరోవైపు, ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ కైవసం చేసుకోవాలని చూసిన బెలారస్ క్రీడాకారిణి సబలెంక‌కు నిరాశ తప్పలేదు.

సొంతగడ్డపై 19 ఏళ్ల కోకో గాఫ్ అదరగొట్టింది. యూఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను ఎగరేసుకపోయింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో గాఫ్ 2-6, 6-3, 6-2 తేడాతో 2వ సీడ్ అరీనా సబలెంక‌ను చిత్తు చేసింది. 2 గంటల 6 నిమిషాలపాటు సాగిన తుది పోరులో తొలి సెట్ మినహా గాఫ్ ఆధిపత్యమే కొనసాగింది. తొలి సెట్‌ కోల్పోయిన ఆ తర్వాత ఆమె బలంగా పుంజుకుని మిగతా రెండు సెట్లను దక్కించుకున్న తీరు అద్భుతం. ఆరంభంలోనే గాఫ్‌కు షాకిచ్చింది సబలెంక. తొలి గేమ్‌లోనే గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే, పుంజుకున్న ఆమె 4వ గేమ్‌లో సబలెంక సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-2తో స్కోరును సమం చేసింది. అనంతరం సబలెంక దూకుడు పెంచింది. 5వ గేమ్‌తోపాటు 7వ గేమ్‌లో గాఫ్ సర్వీస్‌లను బ్రేక్ చేయడంతోపాటు వరుసగా నాలుగు గేమ్‌లను నెగ్గి తొలి సెట్‌ను ఖాతాలో వేసుకుంది.

తొలి సెట్ కోల్పోవడంతో గాఫ్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే, రెండో సెట్‌పై ఆ ప్రభావం పడకుండా చూసుకుంది. అద్భుతంగా ఆడిన ఆమె.. వరుసగా 3వ, 4వ, 5వ గేమ్‌లను నెగ్గి 4-1తో సబలెంకను వెనక్కినెట్టి పట్టు సాధించింది. ఆ తర్వాత సబెలంక రెండు గేమ్‌ల్లో సర్వీస్‌లను కాపాడుకున్నప్పటికీ.. ప్రత్యర్థిక ఏమాత్రం ఇవ్వని గాఫ్ 9వ గేమ్ నెగ్గి రెండో సెట్‌ను దక్కించుకుంది. ఇక, నిర్ణయాత్మక మూడో సెట్‌లో గాఫ్ అదే జోరును పునరావృతం చేసింది. తొలి గేమ్‌లో సర్వీస్‌ను బ్రేక్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చిన ఆమె.. వరుసగా నాలుగు గేమ్‌ల లీడ్‌ను సాధించింది.

ఈ సమయంలో సబలెంక 5వ గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకోవడంతోపాటు 6వ గేమ్‌ గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యాన్ని తగ్గించింది. ఇక, సబలెంకకు గాఫ్ అవకాశం ఇవ్వలేదు. వరుసగా 7వ,8వ గేమ్‌లను నెగ్గడంతో గాఫ్ విజయం లాంఛనమైంది. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ నెగ్గిన గాఫ్ ఆనందానికి అవధుల్లేవు. కోర్టులోనే భావోద్వేగానికి లోనైంది. ఆనంద భాష్పాలతో ఆమె ప్రేక్షకులకు అభివాదం చేసింది. ఈ మ్యాచ్‌లో 25 విన్నర్లతో విరుచుపడిన సబలెంక 6 డబుల్ ఫౌల్స్, 46 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. గాఫ్ 2 ఏస్‌లు, 13 విన్నర్లు బాదింది.

ప్రైజ్‌మనీ..

యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన కోకో గాఫ్ సుమారు రూ. 25 కోట్ల ప్రైజ్‌మనీని దక్కించుకుంది. అలాగే, రన్నరప్‌గా నిలిచిన సబలెంక సుమారు రూ. 12.5 కోట్లు అందుకుంది.

‘నన్ను నమ్మని వారికి ధన్యవాదాలు. 500 టైటిల్ గెలిచినప్పుడు అక్కడితోనే ఆగిపోతానన్నారు. రెండు వారాల క్రితం 1000 టైటిల్ గెలిచినప్పుడు నాకు అదే పెద్దది అని చెప్పారు. కానీ, నేను ఇప్పుడు ఇక్కడ ట్రోఫీతో ఉన్నాను’

- కోకో గాఫ్



Similar News