దిశ, తెలంగాణ బ్యూరో : రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోందని, రికార్డులకు అడ్డాగా ఉప్పల్ స్టేడియం మారిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు అన్నారు. ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ విజేతగా నిలవడంతో పాటు 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సంతోషాన్ని కలిగించిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోరు 297 నమోదు చేసిన గ్రౌండ్‌గా ఉప్పల్ స్టేడియం పేరు క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.
గత ఐపీఎల్‌లో ఉప్పల్‌కు ఉత్తమ పిచ్ అవార్డు రావడాన్ని ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు గుర్తు చేశారు. ఉప్పల్ స్టేడియం రికార్డులకు అడ్డాగా మారిందని, భవిష్యత్‌లోనూ ఈ పేరును కొనసాగించడానికి కృషి చేస్తామన్నారు. మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించడానికి 10 రోజులుగా అహర్నిశలు శ్రమించిన హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు, క్లబ్ సెక్రటరీలకు జగన్‌మోహన్ రావు ధన్యవాదాలు తెలిపారు.