బంతితో ఎక్లోస్టోన్.. బ్యాటుతో హారిస్.. గుజరాత్‌ను చిత్తు చేసిన యూపీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో యూపీ వారియర్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది.
దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో యూపీ వారియర్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత ముంబైపై బోణీ కొట్టిన ఆ జట్టు.. తాజాగా గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. మరోవైపు, గుజరాత్ పేలవ ఫామ్‌తో హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని యూపీ జట్టు 15.4 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అలీస్సా హీలీ(33) ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. మేఘ్న సింగ్ బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు కొట్టింది. అయితే, స్వల్ప వ్యవధిలోనే మరో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరె(12)తోపాటు హీలీ కూడా అవుటవడంతో పవర్ ప్లేలో యూపీ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో గ్రేస్ హారిస్(60 నాటౌట్) హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరో ఎండ్‌లో చమరి ఆటపట్టు(17), శ్వేతా సెహ్రావత్(2) నిరాశపర్చినా.. హారిస్ మాత్రం ప్రత్యర్థి బౌలింగ్‌లో మెరుపులు మెరిపించింది. జట్టును గెలుపు దిశగా నడిపించిన ఆమె.. దీప్తి శర్మ(17 నాటౌట్)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించింది. ఈ గెలుపుతో యూపీ వారియర్స్ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలువగా.. గుజరాత్ అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.
గుజరాత్ మోస్తరు స్కోరుకే
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్‌ను యూపీ బౌలర్లు మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు. ముఖ్యంగా ఎక్లోస్టోన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌లో యూపీ బ్యాటర్లను అడ్డుకుంది. దీంతో నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 5 వికెట్లను కోల్పోయి 142 పరుగులు చేసింది. లిచ్‌ఫీల్డ్(35) టాప్ స్కోరర్. ఆమెతోపాటు గార్డ్‌నెర్(30) పర్వాలేదనిపించడంతో గుజరాత్ ఆ స్కోరైనా చేయగలిగింది. వొల్వార్డ్(28), కెప్టెన్ బెత్ మూనీ(16), హర్లీన్ డియోల్(18) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. యూపీ బౌలర్లలో ఎక్లోస్టోన్ 3 వికెట్లతో సత్తాచాటగా.. రాజేశ్వరి గైక్వాడ్‌కు ఒక్క వికెట్ దక్కింది.
సంక్షిప్త స్కోరుబోర్డు
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 142/5(20 ఓవర్లు)
(లిచ్‌ఫీల్డ్ 35, గార్డ్‌నెర్ 30, ఎక్లోస్టోన్ 3/20)
యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ : 143/4(15.4 ఓవర్లు)
(గ్రేస్ హారిస్ 60 నాటౌట్, అలిస్సా హీలీ 33, తనూజ కన్వార్ 2/23)