దిశ, స్పోర్ట్స్: ‘మహిళల ప్రీమియర్ లీగ్’(డబ్ల్యూపీఎల్)లో రెండు ఓటముల అనంతరం యూపీ వారియర్స్ బోణీ కొట్టింది. బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్ హేయ్లే మాథ్యూస్(55) అర్ధసెంచరీతో రాణించింది. మిగతా బ్యాటర్లెవరూ అంతగా ఆకట్టుకోలేదు. మాథ్యూస్ తర్వాత యస్టికా భాటియా చేసిన 26 పరుగులే రెండో అత్యధిక స్కోరు. యూపీ బౌలర్లలో ఐదుగురూ ఒక్కో వికెట్ తీశారు. ఇక, 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ మహిళల జట్టు.. కేవలం 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కిరణ్ నాగిరే(57) హాఫ్ సెంచరీతో మెరవగా, అలిసా హీలీ(33), గ్రేస్ హ్యారిస్ (38 నాటౌట్) ఫరవాలేదనిపించారు. 31 బంతుల్లోనే 4 సిక్సులు, 6ఫోర్లతో 57 పరుగులు చేసిన కిరణ్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై.. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలవగా, ఇది తొలి ఓటమి.
సంక్షిప్త స్కోరు బోర్డు
ముంబై ఇండియన్స్- 161/ (20 ఓవర్లు)
- హేయ్లే మాథ్యూస్(55)
యూపీ వారియర్స్ 163/3(16.3 ఓవర్లు)
- కిరణ్ నాగిరే(57)