చరిత్ర సృష్టించిన భారత ఎంఎంఏ ఫైటర్ పూజ.. ఆ టోర్నీలో భారత్‌కు తొలి విజయం

భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్ పూజ తోమర్ చరిత్ర సృష్టించింది.

Update: 2024-06-09 13:03 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్ పూజ తోమర్ చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌(యూఎఫ్‌సీ)లో బౌట్ నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఆదివారం అమెరికాలో జరిగిన యూఎఫ్‌సీ లూయిస్‌విల్లే టోర్నీలో మహిళల స్ట్రావెయిట్ డివిజన్‌లో పూజ బ్రెజిల్‌కు చెందిన రేయాన్ డోస్ శాంటోస్‌‌‌తో తలపడింది. 15 నిమిషాలపాటు మూడు రౌండ్లలో జరిగిన బౌట్‌లో పూజ 30-27, 27-30, 29-28 తేడాతో శాంటోస్‌ను మట్టికరిపించింది.

దీంతో యూఎఫ్‌సీ బౌట్‌లో నెగ్గిన తొలి భారత ఎంఎంఏ ఫైటర్‌గా పూజ చరిత్ర సృష్టించింది. ఆమెకు ఇది అరంగేట్ర బౌట్ కావడం మరో విశేషం. బౌట్ అనంతరం పూజ మాట్లాడుతూ.. ‘భారత ఫైటర్లు లూజర్స్ కాదని నిరూపించాలనుకుంటున్నా. మేము త్వరలోనే యూఎఫ్‌సీ చాంపియన్‌గా నిలుస్తాం. ఈ విజయం నాది మాత్రమే కాదు. భారత అభిమానులు, భారత ఫైటర్లది.’ అని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పూజ గతేడాది యూఎఫ్‌సీతో ఒప్పందం చేసుకుంది. యూఎఫ్‌సీ కాంట్రాక్ట్ పొందిన తొలి భారత అథ్లెట్ కూడా ఆమెనే. భారత్ నుంచి అన్షుల్ జుబ్లీ, భరత్ కందారే పాల్గొన్నా తమ బౌట్లలో పరాజయం పాలయ్యారు. 


Similar News