అఫ్గాన్‌కు యూఏఈ షాక్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమం
ఆఫ్ఘనిస్తాన్ జట్టు పసికూన యూఏఈ చేతిలో కంగుతిన్నది.
దిశ, స్పోర్ట్స్: ఈ మధ్య కాలంలో పెద్ద జట్లకు షాకిస్తూ వరల్డ్ క్రికెట్‌ను తనవైపు తిప్పుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్.. పసికూన యూఏఈ చేతిలో కంగుతిన్నది.మూడు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20లో అఫ్గాన్‌ను యూఏఈ ఓడించింది. ఈ విజయంతో యూఏఈ సిరీస్‌ను 1-1తో సమం చేసి సిరీస్ ఆశలు నిలబెట్టుకోవడంతోపాటు సిరీస్ ఫలితాన్ని నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌కు మళ్లించింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌పై 11 పరుగుల తేడాతో యూఏఈ విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 166 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆర్యన్ లక్రా(63), కెప్టెన్ ముహమ్మద్ వసీం(53) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా వారు విఫలమైనా ఓపెనర్ల ప్రదర్శనతో అఫ్గాన్ ముందు యూఏఈ టఫ్ టార్గెటే పెట్టింది. అనంతరం బంతితోనూ ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ను మరో బంతి మిగిలి ఉండగానే ఆలౌట్ చేసింది. దీంతో అఫ్గాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ నబీ(47), హజ్రతుల్లా జజాయ్(36) పోరాటం చేయగా.. మిగతా వారు క్రీజులో నిలువలేకపోయారు. ముహమ్మద్ జవదుల్లా(4/26), అలీ నసీర్(4/24) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. కాగా, నిర్ణయాత్మక మూడో టీ20 షార్జా వేదికగానే నేడు జరగనుంది.