వరల్డ్ నం.2 జంటకు షాకిచ్చిన గాయత్రి జోడీ

సింగపూర్ ఓపెన్‌ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ సంచలన ప్రదర్శన చేశారు.

Update: 2024-05-30 12:34 GMT

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరుగుతున్న సింగపూర్ ఓపెన్‌ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ సంచలన ప్రదర్శన చేశారు. వరల్డ్ నం.30వ ర్యాంక్‌లో ఉన్న ఈ జంట రెండో రౌండ్‌లో ఏకంగా వరల్డ్ నం.2 జోడీకే షాకిచ్చింది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి జోడీ 21-9, 14-21, 21-15 తేడాతో సౌత్ కొరియాకు చెందిన బేక్ హా నా-లీ సో హీ ద్వయాన్ని ఓడించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. 59 నిమిషాలపాటు ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. తొలి గేమ్‌ను గాయత్రి జంట ఏకపక్షంగా నెగ్గి శుభారంభం చేసింది. అయితే, రెండో గేమ్‌లో ప్రత్యర్థి జంట పుంజుకోవడంతో ఆ గేమ్ కోల్పోవాల్సి వచ్చింది. ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఆసక్తికరంగా సాగగా ఒక దశలో 8-8తో స్కోరు సమమైంది. అనంతరం దూకుడు పెంచిన గాయత్రి, ట్రీసా జాలీ వరుసగా ఆరు పాయింట్లు గెలుచుకుని 16-9 ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరు మూడో గేమ్‌ను సొంతం చేసుకుంది.

సింధు చేజేతులా..

సింగిల్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఉమెన్స్ సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు రెండో రౌండ్‌లో పరాజయం పాలైంది. 3వ సీడ్ కరోలినా మారిన్(స్పెయిన్) చేతిలో 13-21, 21-11, 22-20 తేడాతో మ్యాచ్‌ను చేజాతులా కోల్పోయింది. తొలి గేమ్ నెగ్గిన సింధు రెండు గేమ్‌లో ఆ దూకుడు కొనసాగించలేదు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లగా.. అక్కడ మొదటి నుంచి సింధు స్పష్టమైన ఆధిపత్యం కనబర్చింది. ఒక దశలో 15-10తో లీడ్‌లో నిలిచింది. దీంతో విజయం ఖాయమే అనుకున్న తరుణంలో ఆమె చేతులెత్తేసింది. అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఇటీవలే సింధు మలేషియా మాస్టర్స్‌లో ఫైనల్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన విసయం తెలిసిందే. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్‌ కూడా రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. జపాప్ ప్లేయర్ కెంటా నిషిమోటో చేతిలో 21-13, 14-21, 21-15 తేడాతో ఓడి ఇంటిదారిపట్టాడు. 


Similar News