థామస్, ఉబెర్ కప్ టోర్నీల్లో భారత బ్యాడ్మింటన్ జట్లకు కఠిన డ్రా

ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీల డ్రాను శుక్రవారం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ రిలీజ్ చేసింది.

Update: 2024-03-22 12:58 GMT

దిశ, స్పోర్ట్స్ : రెండేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీల డ్రాను శుక్రవారం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) రిలీజ్ చేసింది. చైనా వేదికగా ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు ఈ టోర్నీలు జరగనుండగా.. ఈ టోర్నీల్లో భారత జట్లకు కఠిన డ్రా ఎదురైంది. 2022లో భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్‌ గెలుచుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టబోతున్న భారత టీమ్.. ఇండోనేషియా, థాయిలాండ్, ఇంగ్లాండ్‌లతో కలిసి గ్రూపు-సిలో ఉంది. గత ఎడిషన్‌ ఫైనల్‌లో ఇండోనేషియాపై భారత్ విజయం సాధించింది. 14 సార్లు చాంపియన్‌‌గా నిలిచిన ఇండోనేషియాతోనే కాకుండా సింగిల్స్, డబుల్స్‌లో నాణ్యమైన ఆటగాళ్లతో కూడిన థాయిలాండ్‌తో కూడా భారత్‌కు ఈ సారి సవాల్ తప్పదు.

మరోవైపు, ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టుకు కఠిన డ్రానే ఎదురైంది. గ్రూపు-ఏలో బలమైన చైనా, కెనడా, సింగపూర్ జట్లతో భారత్ తలపడనుంది. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు భారత జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. మూడుసార్లు(1957, 2014, 2016) కాంస్యంతో సరిపెట్టింది. ఇటీవల ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌ టైటిల్ గెలిచిన జోరులో ఉన్న భారత జట్టు ఈ సారి బంగారు పతకం ఆశలు రేపుతోంది. థామస్, ఉబెర్ కప్‌లకు ఇంకా భారత జట్లను ప్రకటించలేదు. అయితే, వరల్డ్ నం.1 పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టితోపాటు సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ భారత జట్టులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే, ఉమెన్స్ జట్టును పీవీ సింధు నడిపించొచ్చు. గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ, అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో, అన్మోల్ ఖర్బ్ జట్టులో ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. 

Tags:    

Similar News