టెక్నాలజీ వాడి మోసం చేశారు.. సచిన్‌పై పాక్ మాజీ స్పిన్నర్ షాకింగ్ కామెంట్స్

టీమ్ ఇండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్‌పై పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Update: 2023-07-02 16:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్‌పై పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్ ఇండియా, పాక్ 2011 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో తలపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సచిన్ (89) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో సచిన్ ఔటైనా కూడా అతన్ని కావాలనే నాటౌట్‌ ఇచ్చారని అజ్మల్ ఆరోపించాడు. అజ్మల్ వేసిన బంతిని సచిన్ లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించగా.. ఈ క్రమంలో బ్యాటును మిస్సైన బంతి నేరుగా వెళ్లి సచిన్ ప్యాడ్లను తాకింది. అజ్మల్‌తోపాటు పాక్ జట్టంతా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసింది. ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గోల్ట్ దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే భారత జట్టు డీఆర్‌ఎస్ కోరింది. దానిలో బంతి లెగ్ స్టంప్‌ను మిస్ అవుతున్నట్లు కనిపించడంలో సచిన్ బతికిపోయాడు.

ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ తిరస్కరించాడు. ఆ ఔట్ విషయంలో కాంట్రవర్సీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఔటే. అంపైర్‌కు, నాకూ ఇద్దరికీ ఆ విషయం తెలుసు. రిప్లేలో కన్వీనియెంట్‌గా రెండు ఫ్రేమ్స్ కట్ చేసి, బంతి వికెట్లను మిస్ అవుతోందని భ్రమింపచేశారు. లేదంటే ఆ బంతి కచ్చితంగా వికెట్లను కూల్చేదే అని అజ్మల్ అభిప్రయపడ్డాడు. ఇన్నేళ్ల తర్వాత ఆ ఔట్‌ గురించి మాట్లాడిన ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గోల్ట్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. తను ఇప్పుడు అక్కడ ఉన్నా కూడా అది ఔటేనని అంటానన్నాడు. 'ఇప్పటికీ ఆ ఔట్‌కు సంబంధించిన నా రియాక్షన్‌ ఫొటోలను నాకు కొందరు పంపుతుంటారు. అది చూస్తే నాకు నవ్వొస్తుంది. కానీ అప్పుడు నాకు నవ్వు రాలేదు. కానీ ఇప్పుడైనా సరే దాన్ని నేను అవుటనే అంటా. అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు' అని గోల్ట్ చెప్పాడు.


Similar News