అప్పుడు ధోని.. ఇప్పుడు హర్మన్ : పీడకలగా రనౌట్లు

ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు అదృష్టం ఏమాత్రం బాగోలేదు. గ్రూప్ దశలో అద్భుతంగా పోరాడినా సెమీఫైనల్ లేదంటే ఫైనల్‌లో మాత్రం ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలవుతోంది. తాజాగా మహిళల టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇదే జరిగింది.

Update: 2023-02-24 04:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు అదృష్టం ఏమాత్రం బాగోలేదు. గ్రూప్ దశలో అద్భుతంగా పోరాడినా సెమీఫైనల్ లేదంటే ఫైనల్‌లో మాత్రం ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలవుతోంది. తాజాగా మహిళల టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇదే జరిగింది. గ్రూప్ దశలో అద్భుతంగా పోరాడిన భారత అమ్మాయిలు జట్టు.. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో మళ్లీ కప్పు సాధించకుండానే ఇంటి దారి పట్టారు.

ప్రతి సెమీస్ లోనూ నిరాశే..

అయితే ఈ ఓటమికి, 2019లో భారత జట్టు వరల్డ్ కప్ ఓటమికి ఉన్న పోలికలు ఉన్నాయని అభిమానులు వాపోతున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ టోర్నీలో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పుడు మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన ప్రదర్శన చేసింది. భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. కానీ సెమీఫైనల్‌లో ఓడటంతో స్మృతి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ ఓటమిని ఆమె నమ్మలేక తలపై చేతులు పెట్టుకొని చూస్తుండిపోయింది.

టాపార్డర్ విఫలం..

అలాగే 2019లో భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది. కీలక ఆటగాళ్లు ఎవరూ క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఇలాంటి సమయంలో క్రీజులో పాతుకుపోయిన మహేంద్ర సింగ్ ధోనీ.. జట్టును దాదాపు గెలిచినంత పనిచేశాడు. కానీ చివర్లో అతను రనౌట్ అవడంతో మ్యాచ్ ముఖ చిత్రమే మారిపోయింది. చివరకు భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇప్పుడు మహిళల టీ20 వరల్డ్ కప్‌లో కూడా టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. జెమీమా రోడ్రిగెజ్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును ఆదుకుంది. ఈ మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించిన హర్మన్ ధనాధన్ ఆటతో ఆకట్టుకుంది.

రనౌట్ జెర్సీ నెంబర్ 7..

హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించేలా కనిపించింది. కానీ దురదృష్టవశాత్తూ రెండో పరుగు తీసే సమయంలో నేలలో బ్యాట్ దిగబడి రనౌట్ అయింది. దీంతో మ్యాచ్ భారత్ చేజారింది. చివరకు టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇలా వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో రనౌట్ అయిన ధోనీ, హర్మన్ ఇద్దరి జెర్సీ నెంబర్ కూడా 7 కావడం. ఈ రనౌట్ భారత్‌కు మరో పీడకలనే మిగిల్చింది. రెండు సందర్భాల్లో కప్పు సాధించేలా కనిపించిన భారత జట్టు మరోసారి నిరాశగా ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత అమ్మాయిలు అద్భుతంగా రాణించినా.. చివరకు సెమీస్‌లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు.

Tags:    

Similar News