మూడో టెస్ట్.. ఇండోర్ పిచ్ ఎలా ఉందంటే!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది.
దిశ, వెబ్ డెస్క్: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా మార్చి 1న ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే అసలు పరీక్ష మూడో టెస్టులో ఎదురుకానుంది. ఎందుకంటే ఇండోర్ టెస్ట్ కోసం మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ బౌన్సీ పిచ్ ను తయారు చేసినట్లు సమాచారం. తొలి 2 టెస్టుల్లో స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. అక్కడ మొదటి రోజు నుంచే స్పిన్ తిరగడం ప్రారంభించింది. అయితే మూడో టెస్ట్ పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉంది. అలాగే ఆస్ట్రేలియా టీంలో మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ లు జట్టులోకి తిరిగి వచ్చారు. దీంతో వారి పేస్ బలం మరింత పెరగనుంది. కాబట్టి వారి విజయావకాశాలు మెరుగయ్యాయి. ఇండోర్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందన్న అంచనాతో భారత్ మూడో పేసర్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇండోర్ లో చివరిసారిగా భారత్, బంగ్లాదేశ్ తో టెస్ట్ ఆడింది. ఆ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. అప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను మన పేసర్లు హడలెత్తించారు. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు కూడా పిచ్ పేసర్లకు సహకరించేలా తయారు చేశారు. దాంతో పాటు బ్యాటర్లకు సహకారం ఉంటుంది. అయితే ఈ వేదిక మీద ఎక్కువ టెస్టులు జరగలేదు. ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 353. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంలా మారనుందని సమాచారం.