ఆ మాత్రం దానికే కోహ్లీ గొప్ప నాయకుడు కాకుండా పోడు : హర్భజన్ సింగ్
విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవనంత మాత్రాన అతను గొప్ప నాయకుడు కాదని అనలేమని మాజీ టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
దిశ, స్పోర్ట్స్ : విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవనంత మాత్రాన అతను గొప్ప నాయకుడు కాదని అనలేమని మాజీ టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ సారథ్యంలో భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. ప్రపంచకప్‌లను సాధించలేదు. అయినప్పటికీ అతన్ని అద్భుతమైన నాయకుడిగా పిలవకుండా ఉండలేము. జట్టులో విజయం సాధించాలనే కోరికను కోహ్లీ పుట్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు 400 పరుగుల టార్గెట్‌ను ఛేదించడమంటే మాములు విషయం కాదు.
జట్టులోని ప్రతి క్రికెటర్‌కూ అలాంటి గట్స్‌ను నేర్పించాడు. చివరి వరకూ పోరాడే తెగువను వారిలో తీసుకొచ్చాడు. గబ్బాలో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఆడిన తీరు ఎప్పటికీ మరువలేం. అప్పట్నుంచే టీమిండియా ఆలోచనా విధానం పూర్తిగా మారింది. విదేశాల్లోనూ మన ఆటగాళ్లను చూస్తే ప్రత్యర్థులు భయపడేలా చేయడంలో కోహ్లీ సక్సెస్ అయ్యాడు’ అని పేర్కొన్నాడు. కాగా, విరాట్ కెప్టెన్సీలో భారత్ తొలిసారిగా ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2018/19 బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని సాధించింది. ఆ తర్వాత 2021/22లోనూ మళ్లీ సిరీస్‌ను సొంతం చేసుకుంది. తాజాగా హ్యాట్రిక్ కోసం నవంబర్‌లో ఆసీస్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఈసారి ఐదు టెస్టుల్లో ఇరు జట్లు తలపడనున్నాయి.