అది ఒక్క ముస్లిం వర్గంలోనే లేదు: సానియా మీర్జా

Update: 2023-02-21 10:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆఖరి ఆటకు సిద్దమైంది. తన సుదీర్ఘ కెరీర్‌కు దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ డబ్ల్యూటీఏ 1000 సిరీస్‌ ఛాంపియన్‌షిప్‌‌తో గుడ్‌బై చెప్పనుండగా.. ఈ నేపథ్యంలో ఓ చానెల్‌తో మాట్లాడిన సానియా మీర్జా ఆసక్తికర విషయాలు పంచుకుంది. పోటీపడడం, గెలవడం వల్ల కలిగే అనుభూతిని కోల్పోతానని తెలిపింది. పెద్ద కోర్టుల్లో ప్రేక్షకుల కేరింతల మధ్య అడుగు పెడుతున్నప్పుడు కలిగే భావనే ప్రత్యేకంగా ఉంటుంది. అది ఇక నుంచి నాకు లభించదు. అన్నింటికన్నా ముఖ్యంగా రసవత్తర పోటీకి దూరమవుతా.. అని చెప్పుకొచ్చారు. టెన్నిస్ ఎప్పుడూ నా జీవితంలో ఒక పెద్ద భాగమని సానియా మీర్జా అన్నారు.


తన రిటైర్మెంట్‌ గురించి మాట్లాడుతూ.. రిటైర్మెంట్‌ తర్వాత ఏం పని చేసినా.. ఈ అనుభూతులు మళ్లీ నాకు కలగవని.. ఆట కోసం సామాజికంగా నేను నిబంధనలను ఉల్లంఘించానని అనుకోవడం లేదు. ఈ నిబంధనలు పెట్టింది ఎవరు..? ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉండాలి. సమాజంలో మనం మరింత మెరుగుపడాలని పేర్కొన్నారు. మహిళా క్రీడాకారులకు మద్దతివ్వకపోవడమనేది ఒక్క ముస్లిం వర్గంలోనే లేదని.. ఈ ఉపఖండంలోనే ఉంది. లేదంటే అన్ని వర్గాల నుంచి చాలా మంది అమ్మాయిలు ఆటల్లో ఉండేవారు. తనను చాలా మంది బాక్సింగ్‌ చేయొద్దన్నారని భారత బాక్సర్ మేరీకోమ్‌ కూడా చెప్పిందన్నారు.

నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు..?


మా కుటుంబం నన్ను టెన్నిస్‌లో ప్రోత్సహించడానికి ఏమాత్రం సంకోచించలేదు. మా కుటుంబం అప్పటి తరం కన్నా చాలా అడ్వాన్స్‌గా ఉంది. మా అమ్మానాన్న ఒత్తిడిని ఎదుర్కొన్నారో లేదో నాకు తెలియదు కానీ.. నన్ను ఒత్తిడికి గురయ్యేలా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆట వల్ల నువ్వు నల్లబడితే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని ఆంటీలు, అంకుల్స్ నాతో అనేవాళ్లు. ప్రతి మహిళా అథ్లెట్‌కు ఇలాంటి కథ ఉంటుంది' అని సానియా మీర్జా చెప్పుకొచ్చింది.

ఆర్‌సీబీ మెంటార్‌గా సానియా..


టెన్నిస్ వీడ్కోలు పలికిన అనంతరం సానియా మీర్జా మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. అది కూడా టెన్నిస్‌కు సంబంధం లేని క్రికెట్‌లో మెంటార్ బాధ్యతల నిర్వర్తించనుంది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) తొలి సీజన్‌కు ఆర్‌సీబీ తమ మహిళా జట్టుకు సానియాను మెంటార్‌గా నియమించుకుంది.

Tags:    

Similar News