నాలుగోసారి టైటిల్ టీమ్ ఇండియా కైవసం
జూనియర్ హాకీ జట్టు మరోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది
సలాల్ : కుర్రాళ్లు అదరగొట్టారు.. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించారు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాను నిలబెట్టుకుంటూ భారత పురుషుల జూనియర్ హాకీ జట్టు మరోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. పాక్‌పై 1-2 తేడాతో గెలుపొంది నాలుగోసారి ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచింది. దాంతో అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. 2004, 2008, 2015 ఎడిషన్లలో భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఒమన్‌లో గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 1-2 తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్లు ఫైనల్లో చిరకాల ప్రత్యర్థిపై కూడా సత్తాచాటారు. అంగద్ సింగ్, అరైజిత్ సింగ్ చెరో గోల్ సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్న గోల్ కీపర్ మోహిత్ హీరో అయ్యాడు. పాక్ తరఫున అలీ బషారత్ ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి టీమ్ ఇండియా ఆధిపత్యమే కొనసాగింది. 12వ నిమిషంలో అంగద్ సింగ్ బిర్ ఫీల్డ్ గోల్‌తో జట్టుకు శుభారంభం అందించాడు. అరైజిత్ సింగ్ కొట్టిన బంతి పాక్ గోల్ కీపర్ అడ్డుకోవడంతో గాల్లోకి లేవగా అక్కడే ఉన్న అంగద్ సింగ్ బంతిని గోల్‌పోస్టులోకి పంపించాడు. కాసేపటికే భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు అరైజిత్ సింగ్. రెండో క్వార్టర్‌లో 19వ నిమిషంలో అంగద్ బిర్ ఫార్వాడ్ చేసిన బంతిని అరైజిత్ సింగ్ మెరుపు వేగంతో గోల్ చేశాడు. కాసేపటికే పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్‌కు మరో గోల్ చేసే అవకాశం వచ్చింది. అయితే, శారద నంద్ తివారి హిట్ చేసిన బంతిని పాక్ కీపర్ రజా అలీ అద్భుతంగా సేవ్ చేయడంతో గోల్ మిస్ అయ్యింది. ఫస్టాఫ్ ముగిసే సమయానికి 2-0తో భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ సమయంలో అలీ బషారత్ 37వ నిమిషంలో ఫీల్డ్ గోల్‌తో పాక్ ఖాతా తెరవడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. అయితే, ఆ తర్వాత భారత్ అద్భుతమైన డిఫెన్స్ ప్రదర్శించింది. మరో గోల్ చేసి స్కోరు సమం చేసేందుకు పాక్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలను టీమ్ ఇండియా డిఫెన్స్ టీమ్ తిప్పికొట్టింది. భారత జట్టు గోల్ కీపర్ మోహిత్ పాక్ ఆటగాళ్లు చేసిన గోల్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకోవడంతో భారత్ చివరి వరకూ ఆధిపత్యం కనబర్చింది. ఈ నేపథ్యంలో అంపైర్ సమయం ముగిసిందని ప్రకటించడంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఆసియా కప్ గెలిచిన టీమ్ ఇండియాకు హాకీ ఇండియా నగదు బహుమతి ప్రకటించింది. ప్రతి ప్లేయర్‌కు రూ. 2 లక్షల చొప్పున, సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ. లక్ష చొప్పున రివార్డు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.