కుర్రాళ్లకు మంచి చాన్స్.. నేటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్
టీ20 వరల్డ్ కప్‌కు ముందు జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్‌తో 20 సిరీస్‌ను కుర్రాళ్లు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ జూన్‌లో జరగనుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా ఆఖరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డపై నేటి నుంచే ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 పోరు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు మొహాలి వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్ విజయం నల్లేరు మీద నడకే. కానీ, ఇటీవల సంచలన విజయాలు నమోదు చేస్తున్న అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. దాదాపు ఏడాది తర్వాత రోహిత్ శర్మ టీ20 జట్టును నడిపించబోతున్నాడు. విరాట్ కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్‌లో పునరాగమనం చేయబోతున్నాడు. వీరు మినహా భారత జట్టు పూర్తిగా యువకులతో నిండిపోయింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు జరుగుతున్న చివరి టీ20 సిరీస్‌లో సత్తాచాటేందుకు కుర్రాళ్లకు ఇది చక్కటి అవకాశం. రాణించి సెలెక్టర్ల దృష్టిలో పడితే పొట్టి ప్రపంచకప్ బెర్త్ కూడా దక్కే అవకాశం ఉంది. మరి, కుర్రాళ్లు ఈ సిరీస్‌ను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.
ఈ సిరీస్‌ను విజయంతో ప్రారంభించడం టీమ్ ఇండియా ఫోకస్ పెట్టింది. అయితే, తుది జట్టు ఎంపిక హెడ్ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌కు తలనొప్పిగా మారింది. ఒక్క స్థానం ఇద్దరు పోటీ పడుతుండటమే అందుకు కారణం. రోహిత్ రీ ఎంట్రీతో ఓపెనర్‌గా అతను ఫిక్స్. అతనితో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ పోటీపడుతున్నారు. ఇంతకుముందు హిట్‌మ్యాన్ టీ20 మ్యాచ్‌లు ఆడకపోవడంతో గిల్, జైశ్వాల్ టీ20ల్లో ఓపెనర్లుగా వ్యవహరించారు. అయితే, రోహిత్ పునరాగమనంతో వీరిలో ఒకరికి మాత్రమే చాన్స్ ఉంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రోహిత్, జైశ్వాల్ ఓపెనర్లు రాగా.. గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. టీమ్ మేనేజ్‌మెంట్ ఇదే ఫాలో అయితే తొలి టీ20లో రోహిత్‌తోపాటు జైశ్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కోహ్లీ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో మూడో స్థానంలో గిల్ బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక, నాలుగో స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు ఖాయంగానే కనిపిస్తుంది. వికెట్ కీపర్ కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ మధ్య పోటీ నెలకొంది. సౌతాఫ్రికాపై సెంచరీ బాది నిరూపించుకున్న శాంసన్‌కు అవకాశం దక్కొచ్చు. రింకు సింగ్‌కు చోటు ఖాయమే. ఆల్‌రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్‌తో పోలిస్తే అక్షర్ పటేల్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపొచ్చు. మరో స్పిన్నర్ బెర్త్ కోసం కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ పోటీపడుతున్నారు. సౌతాఫ్రికాపై టీ20 సిరీస్‌లో రాణించిన కుల్దీప్‌కే అవకాశాలు ఎక్కువ. షమీ, బుమ్రా, సిరాజ్ వంటి సీనియర్ పేసర్లు దూరంగా ఉన్న ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ పేస్ దళాన్ని నడిపించనున్నాడు. అతనితోపాటు అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ బాధ్యతలు పంచుకుంటారు.
అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయలేం
ఆఫ్ఘనిస్తాన్‌పై టీమ్ ఇండియాదే పైచేయి.. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయలేం. ఇటీవల అఫ్గాన్ జట్టు సంచలన ప్రదర్శన చేస్తున్నది. ఇటీవల వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్లను మట్టికరిపించింది. గతేడాది మార్చిలో పాక్‌పై టీ20 సిరీస్ సాధించింది. భారత్‌తో సిరీస్‌కు ముందు యూఏఈపై టీ20 సిరీస్ విజయంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. గుర్బాజ్, జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటివారు ఫామ్‌లో ఉన్నారు. రషీద్ ఖాన్ లేకపోవడం అఫ్గాన్‌కు పెద్ద లోటే. అయితే, నవీన్ ఉల్ హక్, ముజీబ్, ఫజల్హాక్ ఫారూఖీ, నబీ వంటి బౌలర్లలో బౌలింగ్ దళంగా బలంగానే కనిపిస్తున్నది.
ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్ ఇదే. 2018లో ఏకైక టెస్టు కోసం అఫ్గాన్.. భారత్‌కు వచ్చింది. అయితే, వైట్‌బాల్ ఫార్మాట్‌లో మాత్రం ఇంతకుముందు ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. ఇప్పటివరకు ఇరు జట్లు టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్‌ల్లోనే ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌ల్లో అఫ్గాన్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. ఐదుసార్లు తలపడితే.. నాలుగింట టీమ్ ఇండియానే నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చివరిసారిగా ఇరు జట్లు గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో ఫైనల్ మ్యాచ్‌లో ఎదురుపడ్డాయి. అయితే, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది.
పిచ్ రిపోర్టు
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 183. మరోవైపు, బౌలర్లకు కూడా చాన్స్ ఉన్నట్టు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదట్లో పేసర్లు, మ్యాచ్ జరుగుతున్న కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపనున్నారు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇక్కడ జరిగిన 6 మ్యాచ్‌ల్లో రెండింట మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలిస్తే.. నాలుగింట చేజింగ్ చేసిన జట్లు నెగ్గాయి.
తుది జట్లు(అంచనా)
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్/జితేశ్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
ఆఫ్ఘనిస్తాన్ : ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుర్బాజ్, కరీమ్ జనత్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, నవీన్ ఉల్ హక్, గుల్బాదీన్ నబీ, ఫజల్హాక్ ఫారూఖీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, హజ్రతుల్లా జజాయ్.