Wimbledon 2024 : నాలుగో సీడ్ జ్వెరెవ్ ఇంటికి.. అతనికి షాకిచ్చిన ఫ్రిట్జ్

వింబుల్డన్ ఆసక్తికరంగా సాగుతోంది. టైటిల్ రేసులో ఉన్న వాళ్లు ఒక్కొక్కరుగా ఇంటిదారిపడుతున్నారు.

Update: 2024-07-08 19:20 GMT

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్ ఆసక్తికరంగా సాగుతోంది. టైటిల్ రేసులో ఉన్న వాళ్లు ఒక్కొక్కరుగా ఇంటిదారిపడుతున్నారు. మెన్స్ సింగిల్స్‌లో 4వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ నాలుగో రౌండ్‌లో నిష్ర్కమించాడు. అతనికి అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ షాకిచ్చి సంచలనం సృష్టించాడు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ వొండ్రుసోవా, వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ ఇప్పటికే ఓటమి పాలవ్వగా.. 2వ సీడ్ కోకో గాఫ్ కూడా నిష్ర్కమించింది.

అమెరికా ఆటగాడు ఫ్రిట్జ్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. సోమవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫ్రిట్జ్ 4-6, 6-7(4-7), 6-4, 7-6(7-3), 6-3 తేడాతో జర్మనీ ప్లేయర్ జ్వెరెవ్‌ను ఓడించాడు. 3 గంటల 29 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐదో సెట్‌లో ఫలితం ఫ్రిట్జ్‌కు అనుకూలంగా వచ్చింది. మొదట జ్వెరెవ్ ఆధిపత్యమే కొనసాగింది. వరుసగా తొలి రెండు సెట్లు నెగ్గాడు. ఆ తర్వాత పట్టు తప్పాడు. మరోవైపు, ఫ్రిట్జ్ పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా మూడు సెట్లను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. అందులో నాలుగో సెట్‌ను టై బ్రేకర్‌లో నెగ్గడం గమనార్హం. 3 డబుల్ ఫౌల్ట్స్, 33 అనవసర తప్పిదాలతో జ్వెరెవ్ మూల్యం చెల్లించుకున్నాడు. 9వ సీడ్ అలెక్స్ డి మినార్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నాలుగో రౌండ్‌లో అతను 6-2, 6-4, 4-6, 6-3 తేడాతో ఆర్థర్ ఫిల్స్(ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.

క్వార్టర్స్‌కు రిబాకినా.. ఇంటికి గాఫ్

ఉమెన్స్ సింగిల్స్‌లో వింబుల్డన్ మాజీ చాంపియన్ రిబాకినా క్వార్టర్స్‌కు చేరుకుంది. ఈ కజకస్తాన్ క్రీడాకారిణి నాలుగో రౌండ్‌లో వాకోవర్ పొంది ముందడుగు వేసింది. ఆ మ్యాచ్‌లో రిబాకినా ప్రత్యర్థి కాలిన్స్కాయ(రష్యా) రెండో సెట్‌ మధ్యలో గాయం కారణంగా గేమ్ నుంచి తప్పుకుంది. మరోవైపు, అమెరికా స్టార్ క్రీడాకారిణి, 2వ సీడ్ కోకో గాఫ్ ఇంటిదారిపట్టింది. నాలుగో రౌండ్‌లో గాఫ్ 4-6, 3-6 తేడాతో సహచర క్రీడాకారిణి ఎమ్మా నవారో చేతిలో పరాజయం చవిచూసింది. ఒస్టోపెంకో(లాట్వియా), స్విటోలినా(ఉక్రెయిన్) క్వార్టర్స్‌కు చేరుకున్నారు. 


Similar News