IND vs BAN : అంతర్జాతీయ క్రికెట్‌లోకి నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం.. ఆ యువ పేసర్ కూడా
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
దిశ, స్పోర్ట్స్ : హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఇప్పటికే భారత జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్నారు. ఇప్పుడు మరో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అతనికి భారత తుది జట్టులో చోటు దక్కింది. నితీశ్‌తోపాటు యువ పేసర్ మయాంక్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు.
2020 నుంచి దేశవాళీ ఆడుతున్న నితీశ్ 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 627 రన్స్, 22 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 403 పరుగులు చేశాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆకట్టుకున్నాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 142.92 స్ట్రైక్‌రేట్‌తో 303 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఐపీఎల్‌లో మెరవడంతో సెలెక్టర్ల దృష్టిలో పడిన నితీశ్.. మొదట జింబాబ్వే పర్యటనకు తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. అయితే, గాయం కారణంగా ఆ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. సెలెక్టర్లు మరోసారి అతనికి అవకాశం ఇచ్చి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు.