T20 World Cup 2024 : 10 వేదికల్లో 55 మ్యాచులు.. షెడ్యూల్ ​అనౌన్స్​ చేసిన ఐసీసీ

మరో 13 రోజుల్లో భారత్​ వేదికగా వన్డే వరల్డ్​కప్​ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

Update: 2023-09-23 10:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరో 13 రోజుల్లో భారత్​ వేదికగా వన్డే వరల్డ్​కప్​ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రపంచకప్‌తో పాటు వచ్చే 2024 టీ20 వరల్డ్ కప్ కోసం కూడా ఐసీసీ ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఈ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వరల్డ్ కప్​మ్యాచ్‌లను మొదటి సారి అమెరికాలో జరగనుండటం విశేషం. అయితే 2024 ప్రపంచకప్ టోర్నీ తేదీలను, వేదికలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

T20 World Cup 2024 ​టోర్నీ వచ్చే ఏడాది జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జూన్ 30న ఫైనల్ నిర్వహించనున్నారు. వెస్టిండీస్‍లోని అంటిగ్వా అండ్​బార్బుడా, బార్బొడాస్, డొమినికా, సెయింట్ లూసియా, గయానా, సెయింట్ విన్సెంట్ అండ్​ ది గ్రెనెడైన్స్, ట్రినిడాడ్ అండ్​ టొబాగోలో 2024 ప్రపంచ కప్ మ్యాచ్‍లు నిర్వహించనున్నారు. అమెరికాలో డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ వేదికగా జరగనున్నాయి. మొత్తంగా వెస్టిండీస్‍లో ఏడు, అమెరికా మూడు వేదికలుగా 2024 ప్రపంచకప్ మ్యాచ్‍లు నిర్వహించనున్నారు. మొత్తంగా 20 జట్లు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. 10 వేదికల్లో 55 మ్యాచ్‍లు జరగనున్నాయి. వీటిలో 39 మ్యాచ్‍ల వరకు వెస్టిండీస్‌లోని ఏడు వేదికల్లో జరిగే అవకాశం ఉంది. అమెరికాలోని మూడు వేదికల్లో 16 మ్యాచ్‍లు జరగొచ్చు. ఈ పూర్తి మ్యాచ్‍ల షెడ్యూల్‍ను వచ్చే ఏడాది ఆరంభంలో ఐసీసీ ఖరారు చేసే ఛాన్స్ ఉంది.


Similar News