టైటిల్ నిరీక్షణకు తెరదించిన సింధు.. లక్ష్యసేన్, గాయత్రి జోడీ కూడా..
భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు టైటిల్ నిరీక్షణకు తెరదించింది.
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు టైటిల్ నిరీక్షణకు తెరదించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఓ బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను గెలిచింది. లక్నోలో జరుగుతున్న సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది.ఆదివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో చైనా షట్లర్ వు లుయో యును 14-21, 16-21 తేడాతో ఓడించింది. టోర్నీలో మొదటి నుంచి దూకుడు కొనసాగించిన సింధు ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించింది. 47 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సింధు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఇంతకుముందు చివరిసారిగా 2022 జూలైలో సింగపూర్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సింధు ఆ తర్వాత ఫామ్ లేమితో పలు టోర్నీల్లో నిరాశపర్చింది. రెండున్నరేళ్ల తర్వాత టైటిల్ గెలిచి తిరిగి పుంజుకుంది. సింధుకు ఇది రెండో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్. 2022లో విజేతగా నిలిచింది.
లక్ష్యసేన్, గాయత్రి జోడీ తొలిసారిగా..
భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ తొలిసారిగా సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచాడు.ఫైనల్‌లో సేన్ 21-6, 21-7 తేడాతో జియా హెగ్ జాసన్(సింగపూర్)పై గెలుపొందాడు. గతేడాది కెనడా ఓపెన్ నెగ్గిన తర్వాత లక్ష్యసేన్‌కు ఇదే మొదటి టైటిల్. మరోవైపు, మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ కూడా తొలిసారి ఈ టోర్నీ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో గాయత్రి జోడీ 21-18, 21-11 తేడాతో చైనాు చెందిన బావో లీ జింగ్-లీ కియోన్ ద్వయంపై గెలుపొందింది.గాయత్రి జోడీకి ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్. అలాగే, ఈ టోర్నీలో ఉమెన్స్ డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత జోడీగా ఘనత సాధించింది.