ఆ జట్టుకు మళ్లీ కెప్టెన్ వార్నర్.. ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన
బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) ఫ్రాంచైజీ సిడ్నీ థండర్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నియామకమయ్యాడు.
దిశ, స్పోర్ట్స్ : బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) ఫ్రాంచైజీ సిడ్నీ థండర్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నియామకమయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ బుధవారం ప్రకటించింది. 2018లో సౌతాఫ్రికాతో మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన కారణంగా వార్నర్ జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిడ్నీ థండర్ వార్నర్‌ను తిరిగి తమ కెప్టెన్‌గా నియమించుకుంది. దీంతో ఆరేళ్ల తర్వాత వార్నర్ ఆస్ట్రేలియాలో ఓ జట్టుకు సారథ్యం వహించబోతున్నాడు. ‘నా పేరు పక్కన కెప్టెన్ ఉండటం అద్భుతమైన ఫీలింగ్. థండర్ జట్టులో మొదటి నుంచి నేను భాగం. మరోసారి ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం చాలా బాగుంది. వచ్చే సీజన్‌లో యువకులకు నా అనుభవాన్ని పంచుకుంటా.’ అని వార్నర్ తెలిపాడు. కాగా, వచ్చే నెల 15 నుంచి బీబీఎల్ 14వ సీజన్ ప్రారంభంకానుంది.