Swiss Open :క్వార్టర్స్‌లో కిరణ్, ప్రియాన్ష్ ఓటమి
స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు ఒక్కొక్కరుగా ఇంటిదారిపడుతున్నారు.
దిశ, స్పోర్ట్స్ : స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు ఒక్కొక్కరుగా ఇంటిదారిపడుతున్నారు. స్టార్ ప్లేయర్లు సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. తాజాగా యువ షట్లర్లు కిరణ్ జార్జ్, ప్రియాన్ష్ రజావత్ క్వార్టర్స్‌లో తమ పోరాటాన్ని ముగించారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో కిరణ్ జార్జ్ 23-21, 17-21, 15-21 తేడాతో డెన్మార్క్ ఆటగాడు రాస్మస్ జెమ్కే చేతిలో పోరాడి ఓడాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి గేమ్‌ను నెగ్గిన కిరణ్ మ్యాచ్‌లో శుభారంభం చేసినా.. మిగతా రెండు గేమ్‌ల్లో ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చినా ఫలితం దక్కలేదు.
మరో యువ ఆటగాడు ప్రియాన్ష్ రజావత్ కూడా ఇంటిదారిపట్టాడు. క్వార్టర్స్‌లో ప్రియాన్ష్ 15-21, 19-21 తేడాతో 5వ సీడ్, చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్ చేతిలో ఓడిపోయాడు. 43 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రియాన్ష్ వరుస గేమ్‌లను కోల్పోయాడు. ఇక, టోర్నీలో భారత్ తరపున కిదాంబి శ్రీకాంత్ ఒక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సెమీస్‌కు చేరుకున్న శ్రీకాంత్.. అక్కడ చైనీస్ తైపీ ప్లేయర్ లియన్ చున్ యితో తలపడనున్నాడు.