చెన్నయ్ ఓపెన్ టైటిల్ సుమిత్ కైవసం.. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా టాప్-100లోకి ఎంట్రీ
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ చెన్నయ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ చెన్నయ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సుమిత్ 6-1, 6-4 తేడాతో టాప్ సీడ్, ఇటలీకి చెందిన లూకా నార్డీని మట్టికరిపించాడు. గంటా 40 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌ల స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన సుమిత్ రెండు సెట్లలోనూ మ్యాచ్‌ను ముగించాడు. తొలి సెట్‌ను కేవలం 36 నిమిషాల్లో నెగ్గాడు. ఏకపక్షంగా ఆ సెట్‌లో రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. రెండో సెట్‌లోనూ సుమిత్ అదే జోరు కనబరిచాడు. వరుసగా 3వ, 4వ గేమ్‌లను నెగ్గి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ప్రత్యర్థి పుంజకుని పోటీనిచ్చాడు. ఇద్దరు పరస్పరం సర్వీస్‌లను బ్రేక్ చేసుకోవడంతో సెట్ ఆసక్తికరంగా మారింది. టై బ్రేకర్‌కు వెళ్లేలా కనిపించింది. అయితే, ఆ అవకాశాన్ని సుమిత్ ఇవ్వలేదు. 9వ గేమ్‌లో మరోసారి బ్రేక్ పాయింట్ పొందిన అతను.. 10 గేమ్‌నూ నెగ్గి ప్రత్యర్థి ఆట ముగించి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
చెన్నయ్ ఓపెన్ టైటిల్ గెలవడం సుమిత్‌కు ఇది రెండోసారి. 2017లో మొదటి విజేతగా నిలిచాడు. అలాగే, కెరీర్‌లో అతనికిది 5వ చాలెంజర్ టైటిల్. అంతేకాకుండా, టోర్నీలో అతను ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ప్రతి మ్యాచ్‌నూ రెండు సెట్లలోనే ముగించాడు. ఈ విజయంతో ఏటీపీ టోర్నీలో సుమిత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఏకంగా 23 స్థానాలను ఎగబాకాడు. కెరీర్‌లో తొలిసారి టాప్-100 ర్యాంకింగ్స్‌లో అడుగుపెట్టిన అతను.. 98వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
మరోవైపు, చెన్నయ్ ఓపెన్ నెగ్గడంతో సుమిత్ పారిస్ ఒలింపిక్స్ అవకాశాలను కూడా మెరుగుపర్చుకున్నాడు. ఒలింపిక్స్‌లో రేసులో అతను ప్రస్తుతం 83వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఈవెంట్‌లో సింగిల్స్ కేటగిరీలో 64 స్థానాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఎవరైనా తప్పుకోవడం, దేశం నుంచి ప్రాతినిధ్యం వహించే నిబంధనల కారణంగా ఆ బెర్త్‌లు వరల్డ్ నం. 75 వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఉండే చాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో సుమిత్ జూన్ లోపు 250 నుంచి 300 ర్యాంకింగ్ పాయింట్స్ పెంచుకోవడం ద్వారా అతను ఒలింపిక్స్ బెర్త్‌ను సాధించే అవకాశం ఉంది.