ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అడుగు దూరంలో సుమిత్
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. క్వాలిఫయర్స్‌లో రెండు మ్యాచ్‌లు నెగ్గిన అతను.. మరో మ్యాచ్ గెలిస్తే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌లో అడుగుపెట్టనున్నాడు. క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో సుమిత్ 6-3, 6-2 తేడాతో ఆస్ట్రేలియన్ వైల్డ్ కార్డ్ ఎడ్వర్డ్ వింటర్‌ను చిత్తు చేశాడు. గంటా 4 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా రెండు సెట్లను గెలుచుకున్నాడు. నేడు క్వాలిఫయర్ ఫైనల్ రౌండ్‌లో స్లోవేకియా ఆటగాడు అలెక్స్ మోల్కాన్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సుమిత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించనున్నాడు. చివరిసారిగా 2021 ఎడిషన్‌లో సుమిత్ మెయిన్ టోర్నీకి అర్హత సాధించాడు. అయితే, తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నిష్ర్కమించాడు.