కొంపముంచిన ఫీల్డింగ్.. ఆ రెండు క్యాచ్ లు పట్టుంటే..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరోసారి భారత్‌కు ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన కీలక సెమీఫైనల్లో విఫలమైన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 5 పరుగుల తేడాతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

Update: 2023-02-24 04:31 GMT

దిశ, వెబ్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరోసారి భారత్‌కు ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన కీలక సెమీఫైనల్లో విఫలమైన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 5 పరుగుల తేడాతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది.భారత్ అమ్మాయిలు మరోసారి ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేశారు. ఐదు టైటిళ్లతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో తిరుగులేని జట్టుగా నిలిచిన ఆసీస్‌పై గెలవాలంటే ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉత్తమంగా రాణించాలని తెలిసినా టీమిండియా మాత్రం ఆ దిశగా కసరత్తు చేయలేకపోయింది. అనవసర తప్పిదాలతో చేజేతులా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు పట్టలేక, మైదానంలో చురుగ్గా కదల్లేక, బ్యాటింగ్‌లో వికెట్లు పారేసుకుని చివరకు ఓటమికి తలవంచింది. ముఖ్యంగా ఫీల్డింగ్ సమయంలో ఆసీస్ కీలక బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేయడం భారత ఓటమిని శాసించింది.

కీలక క్యాచ్‌లను వదిలేసి..

ఆస్ట్రేలియాల ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇద్దరు బ్యాటర్లు బెత్‌ మూనీ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54), మెగ్‌ లానింగ్‌(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్)‌ల క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశాడు. స్నేహ్‌ రాణా వేసిన ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో మెగ్ లానింగ్‌ క్యాచ్‌ను వికెట్‌కీపర్‌ రిచా ఘోష్ అందుకోలేకపోయింది. బ్యాట్‌ను ముద్దాడి ఎక్కువగా స్పిన్‌ తిరగకుండానే నేరుగా వచ్చి చేతుల్లో పడ్డ బంతిని ఆమె పట్టలేకపోయింది. అప్పుడు లానింగ్‌ స్కోరు కేవలం 1 మాత్రమే. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఆసీస్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యేది.

మైదానంలో చురుగ్గా లేక..

ఆ మరుసటి ఓవర్లోనే రాధ యాదవ్ బౌలింగ్‌లో బెత్ మూనీ ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను లాంగాన్‌లో షెఫాలీ వర్మ చేజార్చింది. బద్దకంగా కదిలిన షెఫాలీ వర్మ చేతుల్లో నుంచి జారిపడ్డ బంతి బౌండరీ వెళ్లింది. అప్పుడు మూనీ చేసిన పరుగులు 32. ఈ క్యాచ్ పట్టినా ఆసీస్ ఇన్నింగ్స్ స్వల్ప పరుగులకే ముగిసేది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో లానింగ్‌ను స్టంపౌట్‌ చేసే సువర్ణ అవకాశాన్నీ రిచా వృథా చేసింది. బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఆమె సరైన సమయంలో పట్టలేక ఆలస్యంగా స్టంప్స్‌ను ఎగరగొట్టింది. కానీ అప్పటికే లానింగ్‌ క్రీజులోకి వచ్చింది. అప్పుడు ఆమె చేసిన పరుగులు 9. ఈ అవకాశాలను అందుకున్న ఆ ఇద్దరూ భారత్ ఓటమిని శాసించారు.

ఆ రనౌట్ చేసినా..

17వ ఓవర్లో ఐదో బంతికి వికెట్‌కీపర్‌ వైపు జెమీమా త్రో విసిరితే గార్డ్‌నర్‌ రనౌట్‌ అయ్యేది. కానీ బౌలర్‌ వైపు త్రో విసిరింది. దాంతో గార్డనర్(18 బంతుల్లో 5 ఫోర్లతో 31) చేయాల్సిన నష్టం చేసింది. అంతేకాకుండా కొన్ని బంతులు ఫీల్డర్ల చేతుల్లో నుంచి జారి వెళ్లిపోయాయి. ఈ ఫీల్డింగ్‌ తప్పిదాలే మ్యాచ్‌లో భారత కొంపముంచాయి. మరోవైపు ఆసీస్ సెన్సేషన్ ఫీల్డింగ్‌తో భారత్‌ను మట్టి కరిపించింది. ఈ మ్యాచ్‌లో అదనపు బ్యాటర్‌గా బరిలోకి దిగిన యాస్తిక భాటియాను రనౌట్ చేసింది. షార్ట్‌ మిడ్‌ వికెట్‌లోకి ఆడిన యస్తికా లేని పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకుంది. కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కూడా రనౌట్‌‌గా వెనుదిరిగింది. సెమీఫైనల్లో బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రెండు జట్లు సమానంగా కనిపించాయి. కానీ రెండు జట్లకు మధ్య అంతరం మాత్రం కేవలం ఫీల్డింగ్ మాత్రమే. మ్యాచ్‌ చేజారుతున్న సమయంలోనూ ఆస్ట్రేలియా సూపర్‌ ఫీల్డింగ్‌తో అదరగొట్టి విజయాన్ని అందిపుచ్చుకుంది.

Tags:    

Similar News