స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన నిఖత్ జరీన్
స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు చేరుకుంది.
దిశ, స్పోర్ట్స్ : బల్గేరియాలో జరుగుతున్న 75వ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారతస్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీస్ బౌట్‌లో నిఖత్ 5-0 తేడాతో బల్గేరియాకు చెందిన జ్లాటిస్లావా చుకనోవాను చిత్తు చేసింది. సొంత ప్రేక్షకుల మద్దతుతో జ్లాటిస్లావా చుకనోవా ఆరంభంలో దూకుడుగా ఆడింది. అయితే, నిఖత్ ఏ మాత్రం పట్టుదల వదల్లేదు. మొదట్లో ఆచితూచి ఆడిన నిఖత్ ఆ తర్వాత ప్రత్యర్థిపై కచ్చితమైన పంచ్‌లతో దాడిచేసి పైచేయి సాధించింది. ఆదివారం ఫైనల్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ సబీనా బొబోకులోవాతో నిఖత్ తలపడనుంది. అలాగే, నిఖత్‌తోసహా ఆరుగురు భారత బాక్సర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. 66 కేజీల కేటగిరీ సెమీస్‌లో అరుంధతి చౌదరి 5-0 తేడాతో జెస్సికా ట్రైబెజోవా(స్లోవేకియా)పై గెలుపొందింది. పురుషుల విభాగంలో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘల్ 51 కేజీల సెమీస్‌లో 5-0 తేడాతో టర్కీకి చెందిన గుమస్ సమేత్‌ను ఓడించాడు. 48 కేజీల సెమీస్‌లో బారున్ సింగ్ 5-0 తేడాతో ఖేనౌసి కమెల్(అల్జీరియా)పై, 57వ కేజీల సెమీస్‌లో సచిన్ 4-1 తేడాతో అబ్దురైమోవ్ ఐడర్(ఉక్రెయిన్)పై నెగ్గారు. 67 కేజీల సెమీస్‌లో రజత్ వాకోవర్ ద్వారా ఫైనల్‌కు చేరుకున్నాడు.