ఐపీఎల్‌లోకి తిరిగొస్తా : స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీమ్ స్మిత్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నాడు.

Update: 2024-08-16 19:25 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీమ్ స్మిత్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. కొంతకాలంగా స్మిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్‌(ఎంఎల్‌సీ) టోర్నీలో సంచలన ప్రదర్శన చేశాడు. స్మిత్ కెప్టెన్సీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు తొలిసారిగా టైటిల్‌ను గెలుచుకుంది. ఆ టోర్నీలో స్మిత్ 336 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్‌లో మరో అవకాశాన్ని కోసం ఎదురుచూస్తున్నా. కచ్చితంగా నా పేరు ఇస్తాను. కొంతకాలంగా టీ20ల్లో, ఫ్రాంచైజీ క్రికెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నా. కాబట్టి, కచ్చితంగా నేను వేలంలో పాల్గొంటా. ఏం జరుగుతుందో చూద్దాం.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, స్మిత్ చివరిసారిగా 2021లో ఐపీఎల్ ఆడాడు. ఆ తర్వాత గత రెండు సీజన్ల వేలంలో అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్‌లో 103 మ్యాచ్‌లు ఆడిన అతను 2,485 పరుగులు చేశాడు.


Similar News