డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు స్టార్ క్రికెటర్లు.. 4నెలల నిషేధం
విచారణలో తప్పు ఒప్పుకున్నారు.
దిశ, స్పోర్ట్స్: జింబాబ్వే క్రికెట్‌లో స్టార్ క్రికెటర్లు డోపీలుగా తేలడం కలకలం రేపుతున్నది. డోప్ టెస్టులో విఫలమైన జింబాబ్వే క్రికెటర్లు వెస్లీ మధేవెరె, బ్రాండన్ మవుటాలపై జింబాబ్వే క్రికెట్ బోర్డు(జెడ్‌సీ) కఠిన చర్యలు తీసుకుంది. వీరిద్దరిపై నాలుగు నెలలపాటు నిషేధం విధించింది. ఈ మేరకు జింబాబ్వే క్రికెటర్ బోర్డు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అంతర్గత డోప్ పరీక్షల్లో మధేవెరె, మవుటా నిషేధం విధించిన వినోదభరిత డ్రగ్ పాజిటివ్‌గా తేలారు. దీంతో బోర్డు వీరిపై సస్పెన్షన్ వేటువేసింది. అనంతరం క్రమశిక్షణా విచారణలో వీరు తప్పు ఒప్పుకున్నారు.జెడ్‌సీ ఎంప్లాయిమెంట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు అంగీకరించారు. దీంతో బోర్డు వీరిపై చర్యలకు పూనుకుంది. మధేవెరె, మవుటాలను నాలుగు నెలలపాటు బ్యాన్ చేయడంతోపాటు వారి మూడు నెలల జీతాల్లో 50 శాతం కోత పెట్టనున్నట్టు వెల్లడించింది. జనవరి నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.
జింబాబ్వే మరో క్రికెటర్ కెవిన్ కసుజా కూడా డోపీగా తేలాడు. గత వారం జరిగిన అంతర్గత డోపింగ్ పరీక్షలో అతను నిషేధం డ్రగ్ వాడినట్టు తేలింది. దీంతో జింబాబ్వే క్రికెటర్ బోర్డు తక్షణమే అతన్ని సస్పెండ్ చేసింది. త్వరలోనే అతను విచారణకు హాజరవుతాడని బోర్డు తెలిపింది.
కాగా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మధేవెరె, స్పిన్నర్ బ్రాండన్ మవుటా చివరిసారిగా గతేడాది డిసెంబర్‌లో ఐర్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన స్పిన్నర్ బ్రాండన్ మవుటా 4 టెస్టులు, 12 వన్డేలు, 10 వన్డేలు ఆడగా.. మొత్తం 26 వికెట్లు తీసుకున్నాడు. ఇక, మధేవెరె పరిమిత ఓవర్ల జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. 36 వన్డేలు, 60 టీ20లు ఆడిన అతను 26 వికెట్లతోపాటు 1752 పరుగులు చేశాడు. మరోవైపు, 2020లో టెస్టు అరంగేట్రం చేసిన కెవిన్ కసుజా 5 టెస్టుల్లో 249 పరుగులు చేశాడు. 2021లో పాకిస్తాన్‌పై చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.