డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ విజేతగా తెలుగమ్మాయి శ్రీజ

నైజీరియాలో జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ లాగోస్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టింది.

Update: 2024-06-23 16:41 GMT

దిశ, స్పోర్ట్స్ : నైజీరియాలో జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ లాగోస్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టింది. ఉమెన్స్ సింగిల్స్, డబుల్స్ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో శ్రీజ 4-1(10-12, 11-9, 11-6, 11-8, 11-6) తేడాతో చైనా క్రీడాకారిణి డింగ్ యిజీని చిత్తు చేసింది.

మ్యాచ్‌లో మొదట శ్రీజకు శుభారంభం దక్కలేదు. తొలి గేమ్‌ కోల్పోయింది. ఆ తర్వాత బలంగా పుంజుకున్న ఆమె వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి టైటిల్ దక్కించుకుంది. దీంతో డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత ప్యాడ్లర్‌గా రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా, అర్చన కామత్‌తో కలిసి మహిళల డబుల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో శ్రీజ, అర్చన జోడీ 3-0 తేడాతో మరో భారత ద్వయం యశస్విని-దియా పరాగ్‌ జంటపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ టైటిల్‌‌ను భారత ఆటగాళ్లు మానవ్ వికాస్, హర్మీత్ దేశాయ్ దక్కించుకున్నారు. 


Similar News