దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూపీఎల్ గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో హర్లీన్ డియోల్(45 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 67), సోఫియా డంక్లీ(28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హీథర్ నైట్ రెండేసి వికెట్లు తీయగా.. మేఘన స్కట్, రేణుకా సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఓపెనర్ సబ్బినేని మేఘన(8) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్‌తో సోఫియా డంక్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఆర్‌సీబీ బౌలర్లపై సోఫియా ఎదురు దాడికి దిగింది. ప్రీతీ బోస్ వేసిన ఐదో ఓవర్‌లో వరుసగా 4,6,4, 4,4 బాది 23 పరుగులు పిండుకుంది. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.