బిగ్ బాష్ లీగ్ ఆడబోతున్న స్మృతి మంధాన.. ఆ జట్టుతో ఒప్పందం
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే మహిళల బిగ్ బాష్ లీగ్(డబ్ల్యూబీబీఎల్)-10వ సీజన్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.
దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే మహిళల బిగ్ బాష్ లీగ్(డబ్ల్యూబీబీఎల్)-10వ సీజన్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు ఫ్రాంచైజీతో మంధాన ఒప్పందం చేసుకుంది. మంగళవారం ఎక్స్ వేదికగా ఫ్రాంచైజీ ఈ విషయాన్ని వెల్లడించింది. మంధాన దూకుడు ఆటతీరు జట్టు బ్యాటింగ్ సామర్థ్యాన్ని పెంచుతుందని ఫ్రాంచైజీ భావిస్తున్నది. స్మృతి మంధాన మాట్లాడుతూ..‘ఆస్ట్రేలియాలో ఆడటానికి ఎల్లప్పుడు ఎదురుచూస్తాను. విజయవంతమైన స్ట్రైకర్స్ జట్టుకు తన సేవలు అందించే అవకాశం రావడం పట్ల ఆసక్తిగా ఉన్నా.’ అని తెలిపింది.
మంధాన గతంలో మూడు డబ్ల్యూబీబీఎల్ సీజన్లలో పాల్గొంది. బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ జట్లకు ఆడింది. 7వ సీజన్‌లో సిడ్నీ థండర్ తరపున సత్తాచాటింది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌పై 64 బంతుల్లో 114 పరుగులు చేసింది. మొత్తంగా డబ్ల్యూబీబీఎల్‌లో మంధాన 389 మ్యాచ్‌ల్లో 784 పరుగులు చేసింది. మరోవైపు, అడిలైడ్ స్ట్రైకర్స్ వరుసగా గత రెండు సీజన్లలో చాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టు హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసింది. 10వ సీజన్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభంకానుంది.