ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-3లో భారత ఓపెనర్

ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిచా ఘోష్, పేసర్ రేణుక సింగ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లను సాధించారు.

Update: 2023-02-21 12:46 GMT

దుబాయ్: ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిచా ఘోష్, పేసర్ రేణుక సింగ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లను సాధించారు. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రిచా ఘోష్ 16 స్థానాలు ఎగబాకి తొలిసారిగా 20వ ర్యాంక్‌ను అందుకున్నది. టీ20 వరల్డ్ కప్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో 31, 44, 47 పరుగులతో సత్తా చాటడంతో ఆమె ర్యాంక్ మెరుగుపడింది. అయితే, ఐర్లాండ్‌ మ్యాచ్‌లో ఆమె డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపర్చిన విషయం తెలిసిందే. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నది. చివరి గ్రూపు మ్యాచ్‌లో అర్ధ సెంచరీ బాది భారత్‌ను సెమీస్‌కు చేర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

అలాగే, షెఫాలీ వర్మ 10వ ర్యాంక్, జెమీమా రోడ్రిగ్స్ 12వ ర్యాంక్, హర్మన్‌ప్రీత్ కౌర్ 13వ ర్యాంక్‌లో ఉన్నారు. వరల్డ్ కప్‌లో బంతితో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న రేణుక సింగ్ సైతం తన ర్యాంక్‌ను భారీగా మెరుగుపర్చుకున్నది. బౌలింగ్ విభాగంలో 7 స్థానాలు వెనక్కినెట్టి 5వ ర్యాంక్‌తో కెరీర్ బెస్ట్ సాధించింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైనప్పటికీ.. రేణుక 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటింది. ర్యాంకింగ్స్‌లో రేణుక కంటే ముందు దీప్తి శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ 2 స్థానాలు కోల్పోయి 4వ ర్యాంక్‌కు పడిపోయింది.

Tags:    

Similar News