జూలై 1న జింబాబ్వేకు భారత ఆటగాళ్లు.. కెప్టెన్ గిల్‌తోపాటు ఆ నలుగురు డౌటే

జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-06-25 12:52 GMT

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్ ఇండియాను శుభ్‌మన్ గిల్ నడిపించనున్నాడు. వచ్చే నెల 6న హరారే వేదికగా తొలి టీ20తో సిరీస్ ప్రారంభంకానుంది. అయితే, భారత ఆటగాళ్లు వచ్చే నెల 1న జింబాబ్వేకు బయల్దేరనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో హై పర్ఫామెన్స్ క్యాప్ మంగళవారంతో ముగిసింది. కొందరు ఇప్పటికే క్యాంప్‌ నుంచివెళ్లిపోయారు. జట్టుకు ఎంపికైన ప్లేయర్లు ముంబైలో సమావేశమై.. అక్కడి నుంచి హరారేకు వెళ్లనున్నారు.

అయితే, కెప్టెన్ గిల్ జట్టుతో వెళ్లడం లేదని సమాచారం. టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి రిలీజ్ అయిన గిల్ ఇంకా భారత్‌కు రాలేదని, నేరుగా జింబాబ్వేలోనే జట్టుతో కలవనున్నట్టు తెలుస్తోంది. అలాగే, టీ20 వరల్డ్ కప్ జట్టు సభ్యులు యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, స్టాండ్ బై ప్లేయర్లు రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరు విండీస్‌లో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ప్రయాణం ముగిసిన తర్వాతే ఈ నలుగురుతో జట్టులో చేరనున్నారు. మరోవైపు, కొత్త హెడ్ కోచ్ నియామకం ఇంకా పూర్తి కాకపోవడంతో జింబాబ్వే టూరుకు భారత జట్టు కోచ్‌గా ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


Similar News