Hardik Pandya : పాండ్యాకు డబుల్ షాక్.. వైస్ కెప్టెన్సీ పోస్టు ఊస్ట్

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా‌కు సెలెక్టర్లు డబుల్ షాక్ ఇచ్చారు.

Update: 2024-07-18 15:25 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా‌కు సెలెక్టర్లు డబుల్ షాక్ ఇచ్చారు. రోహిత్ తర్వాత టీ20 పగ్గాలు పాండ్యాకే దక్కుతాయని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే, సెలెక్టర్లు అనూహ్యంగా సూర్యకుమార్‌‌ను కెప్టెన్‌గా నియమించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూర్య వైపే మొగ్గు చూపారు. అయితే, టీ20 కెప్టెన్సీ ఆశించి భంగపడిన పాండ్యాకు మరో షాక్ తప్పలేదు. వైస్ కెప్టెన్సీ పోస్టు నుంచి తప్పించారు.

టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్‌కు పాండ్యా డిప్యూటీగా వ్యవహరించాడు. అయితే, శ్రీలంక పర్యటనలో పాండ్యాను వైస్ కెప్టెన్‌గా కొనసాగించలేదు. వన్డే, టీ20ల్లో యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో గిల్ టీమ్ ఇండియాకు టీ20 సిరీస్ అందించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1తో దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, శ్రీలంక టూరులో పాండ్యా కేవలం టీ20 మ్యాచ్‌లకే అందుబాటులో ఉండనున్నాడు. వన్డే సిరీస్‌కు అతనికి విశ్రాంతినిచ్చారు. వ్యక్తిగత కారణాల నేపథ్యంతో పాండ్యా రెస్ట్ కోరినట్టు తెలుస్తోంది.

పాండ్యా తరుచుగా గాయాల పాలవడం కారణంగా అతన్ని కెప్టెన్‌గా పరిగణించలేదని తెలుస్తోంది. జట్టులో పాండ్యా కీలకమైన ప్లేయర్‌గా ఉన్నాడు. అతనిలాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ భారత క్రికెట్‌లో చాలా అరుదు. గాయాలతో సతమతమవుతున్న అతనిపై కెప్టెన్సీ అదనపు భారమవుతుందని, తద్వారా జట్టు అతని సేవలను కోల్పోయే అవకాశం ఉంటుందని సెలెక్టర్లు భావించినట్టు తెలుస్తోంది. అలాగే, జట్టు దీర్ఘ ప్రయోజనాల దృష్ట్య సూర్యను కెప్టెన్‌గా నియమించినట్టు తెలుస్తోంది.  

Tags:    

Similar News