Shreyanka Patil: భారత బౌలర్ సంచలన ప్రదర్శన.. తొలి బౌలర్‌గా..

ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌(డబ్ల్యూసీపీఎల్‌)లో భారత బౌలర్ శ్రేయాంక పాటిల్ సంచలన ప్రదర్శనతో సత్తాచాటింది.

Update: 2023-09-04 16:23 GMT

బ్రిడ్జ్‌టౌన్ : ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌(డబ్ల్యూసీపీఎల్‌)లో భారత బౌలర్ శ్రేయాంక పాటిల్ సంచలన ప్రదర్శనతో సత్తాచాటింది. ఈ లీగ్‌లో పాల్గొన్న తొలి భారత మహిళా క్రికెటర్‌గా నిలిచిన ఆమె.. తాజాగా మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. డబ్ల్యూసీపీఎల్‌‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది. గుయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడుతున్న ఆమె.. బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసింది. అయితే, ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న గుయానా అమెజాన్ వారియర్స్ ఓడిపోయింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146/4 స్కోరు చేసింది. ఛేదనకు దిగిన బార్బడోస్ రాయల్స్ టీమ్ మరో నాలుగు బంతులు ఉండగానే 147/7 స్కోరు చేసి విజయం సాధించింది. ఎరిన్ బర్న్స్(53 నాటౌట్) అద్భుతమైన పోరాటంతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. గుయానా అమెజాన్ వారియర్స్ పరాజయం పాలైనప్పటికీ.. శ్రేయాంక పాటిల్(4/34) బంతితో రాణించింది. ప్రమాదకరమైన హేలీ మాథ్యూస్‌తోపాటు రషద విలియమ్స్, ఆలియా, చెడియన్ నేషన్ వికెట్లను తీసింది.


Similar News