IND VS BAN : టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడు మూడో మ్యాచ్

సూర్యకుమార్ నేతృత్వంలోనే భారత టీ20 జట్టు జోరు మీద ఉన్నది.

Update: 2024-10-11 19:19 GMT

దిశ, స్పోర్ట్స్ : సూర్యకుమార్ నేతృత్వంలోనే భారత టీ20 జట్టు జోరు మీద ఉన్నది. బంగ్లాదేశ్‌ను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించి టీ20 సిరీస్ దక్కించుకుంది. ఇప్పుడు సిరీస్‌ క్లీన్‌స్వీప్ కన్నేసింది. నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నామమాత్రపు మూడో టీ20 జరగనుంది. హ్యాట్రిక్ విజయం సాధించి సిరీస్ వైట్‌వాష్ చేయాలని భారత కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. టీమిండియా దూకుడు చూస్తుంటే భారత్ గెలుపు ఖాయంగానే కనిపిస్తున్నది. మరోవైపు, ఆఖరి టీ20లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తున్నది.

గత రెండు మ్యాచ్‌ల్లో భారత కుర్రాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్‌లను ఏకపక్షం చేశారు. గత మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. 34 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. నితీశ్ ఆల్‌రౌండర్‌గా రాణించడం భారత్‌కు కలిసొచ్చే అంశం. అదే మ్యాచ్‌లో రింకు సింగ్ కూడా మెరుపులు మెరిపించాడు. హార్దిక్ పాండ్యా రెండు మ్యాచ్‌ల్లోనూ కీలక పరుగులు జోడించాడు. తొలి మ్యాచ్‌లో రాణించిన శాంసన్, అభిషేక్, సూర్యకుమార్ రెండో మ్యాచ్‌లో విఫలమైనా.. వారి సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు. ఉప్పల్ స్టేడియంలోనూ బ్యాటర్లు చెలరేగితే భారీ స్కోరు ఖాయమే. అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, పాండ్యా, మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డి‌లతో బౌలింగ్ దళానికి కూడా ఢోకా లేదు.

మయాంక్ ఔట్.. హర్షిత్ రాణా ఇన్?

తొలి టీ20లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, యువ పేసర్ మయాంక్ యాదవ్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. మూడో టీ20లో మరో యువ పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ సాధించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో అతన్ని బంగ్లాతో సిరీస్‌కు ఎంపిక చేశాడు. తొలి రెండు టీ20ల్లో మయాంక్‌ను తీసుకోవడంతో రాణాకు చోటు దక్కలేదు. మూడో టీ20లో మయాంక్‌ను పక్కనపెట్టి అతన్ని తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే, భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. వరుణ్ చక్రవర్తికితోడుగా రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. రియాన్ పరాగ్‌‌ స్థానంతో అతన్ని తీసుకునే చాన్స్ ఉంది.

తుది జట్లు(అంచనా)

భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్(కెప్టెన్), నితీశ్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్

బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, లిటాన్ దాస్, శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిది హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, తాంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం.

Tags:    

Similar News