బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సింధు‌కు షాక్.. లక్ష్యసేన్, ప్రణయ్ ముందడుగు..

భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుకు షాక్.

Update: 2023-08-22 17:24 GMT

కోపెన్‌హాగెన్ : భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుకు షాక్. ఈ ఏడాది ఫామ్ లేమితో వరుస టోర్నీల్లో విఫలమైన సింధు.. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ చేతులెత్తేసింది. ఉమెన్స్ సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో బై ద్వారా నేరుగా రెండో రౌండ్‌కు చేరుకున్న ఆమె.. అక్కడ దారుణంగా నిరాశపరిచింది. డెన్మార్క్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సింధు రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో సింధు 14-21, 14-21 తేడాతో జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహరా చేతిలో పరాజయం పాలైంది. 44 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సింధు అనవసర తప్పిదాలు చేసి రెండు గేమ్‌లను కోల్పోయింది. ముందుగా సింధు, ఒకుహరా పాయింట్స్ కోసం పోటీపడటంతో తొలి గేమ్ ఆసక్తికరంగా మొదలైంది. ఈ క్రమంలో 9-6తో వెనుకబడిన సింధు.. పుంజుకుని వరుసగా మూడు పాయింట్స్ నెగ్గి స్కోరును సమం చేసింది.

ఆ తర్వాత ప్రత్యర్థి దూకుడు పెంచగా.. సింధు అదే తరహాలో జోరు కనబర్చలేకపోయింది. దాంతో తొలి గేమ్‌ కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌ను దూకుడు ప్రారంభించింది. సింధు 9 పాయింట్స్ నెగ్గే వరకూ ప్రత్యర్థి ఖాతా కూడా తెరవలేదు. 9-0తో లీడ్‌లో ఉన్న భారత స్టార్ సునాయాసంగా గేమ్‌ను దక్కించుకునేలా కనిపించింది. అయితే, అనవసర తప్పిదాలు చేసి చేజాతులా గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కోల్పోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. కాగా, 2019లో సింధు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకోవడంతోపాటు 2017, 2018లో రజతాలు, 2013, 2014లో కాంస్య పతకాలు గెలుచుకుంది. ఉమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశ ఫలితాలే వచ్చాయి. ఉమెన్స్ డబుల్స్‌లో అశ్విని భట్-శిఖా గౌతమ్ జోడీ 14-21, 21-11, 14-21 తేడాతో డెబోరా జిల్లే-చెరిల్ సీనెన్(నెదర్లాండ్స్) చేతిలో పోరాడి ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహీ దేవాంగన్ జోడీ‌పై 12-21, 11-21 తేడాతో లిండా ఎఫ్లెర్-జాన్సెన్(జర్మనీ) జంట విజయం సాధించింది.

లక్ష్యసేన్, ప్రణయ్ ముందడుగు..

పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ తన జోరును కొనసాగిస్తూ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో లక్ష్యసేన్ 21-11, 21-12 తేడాతో కొరియా షట్లర్ జియోన్ హ్యాక్ జిన్‌‌ను చిత్తు చేశాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌‌లో భారత ఆటగాడు 36 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట ముగించాడు. మరో స్టార్ ఆటగాడు ప్రణయ్ సైతం మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్‌లో 9వ సీడ్ ప్రణయ్ 21-9, 21-14 తేడాతో ఇండోనేషియాకు చెందిన చికో ఆరా ద్వి వార్డోయో‌‌పై సునాయాసంగా గెలుపొందాడు. తొలి గేమ్‌లో ప్రణయ్‌ హవానే కొనసాగగా.. రెండో గేమ్‌లో మాత్రం ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదుర్కొన్నాడు. ఇండోనేషియా ఆటగాడు స్కోరును సమం చేస్తూ ఇబ్బంది పెట్టాలని చూసినా ప్రణయ్ మాత్రం పట్టువదల్లేదు. 13-13తో స్కోరు సమమైన తర్వాత మరింత దూకుడు పెంచిన ప్రణయ్ వరుసగా 6 పాయింట్స్ నెగ్గి అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు.


Similar News