భారత 'బి' జట్టుకు ధావన్ నేతృత్వం?.. ఆసియా కప్‌ బరిలో యువ జట్టు!

ఈ ఏడాది చైనాలో జరగబోయే ఆసియా గేమ్స్‌లో భారత క్రికెట్ జట్లు బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది.

Update: 2023-06-30 14:11 GMT

న్యూఢిల్లీ : ఈ ఏడాది చైనాలో జరగబోయే ఆసియా గేమ్స్‌లో భారత క్రికెట్ జట్లు బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆసియా క్రీడలకు జట్లను పంపించని బోర్డు.. ఈ సారి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళల జట్టు పాల్గొంటుంది. అయితే, పురుషుల జట్టు విషయానికొస్తే సీనియర్లను కాకుండా యువకులతో కూడిన ‘బి’ జట్టును పంపించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఈ జట్టును సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నడిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 7న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో దీనిపై పూర్తి స్పష్టతరానుంది.

టీమ్ ఇండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కొంతకాలంగా భారత జట్టులో చోటు దక్కడం లేదు. ముందుగా కేఎల్ రాహుల్.. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రాణించడంతో ధావన్ స్థానం గల్లంతైంది. గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. ఆ సిరీస్‌లో వరుసగా 7, 8, 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. దాంతో అతన్ని సెలెక్టర్లు పక్కనపెట్టారు. ఇటీవల విండీస్ పర్యటనకు ధావన్‌ను దూరంపెట్టారు. ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో కూడా ధావన్ పాల్గొనే అవకాశాల్లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పలు మ్యాచ్‌ల్లో అతను నిరాశపర్చినప్పటికీ వన్డే ఫార్మాట్‌లో ప్రదర్శన బాగానే ఉన్నది. ధావన్ 44.11 సగటుతో కొనసాగుతున్నాడు.

గతంలో టీమ్ ఇండియాకు సారథ్యం వహించిన అనుభవం కూడా ధావన్‌కు ఉన్నది. అలాగే, ఐపీఎల్-16లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని సేవలను బోర్డు వినియోగించుకోవాలనుకుంటున్నది. ఆసియా కప్‌కు ధావన్ నేతృత్వంలో ‘బి’ జట్టును పంపాలని భావిస్తున్నది. ఆసియా కప్‌కు పంపే ‘బి’ జట్టుకు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రింకు సింగ్, దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్‌‌లతోపాటు ఇటీవల సత్తాచాటిన యువ క్రికెటర్లను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, భారత ‘బి’ జట్టుతో ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌‌ను కోచ్‌గా పంపనున్నట్టు సమాచారం. గతంలో రాహుల్ ద్రవిడ్ స్థానంలో పలు సిరీస్‌ల్లో టీమ్ ఇండియాకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.


Similar News