మొదటి ఐదుగురు ఆటగాళ్లు వాళ్లే: Shikhar Dhawan
ఈ ఏడాది భారత గడ్డపై జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు రోజులు దగ్గరపడుతున్నాయి
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత గడ్డపై జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు రోజులు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు టోర్నీకి సిద్ధమవుతున్నాయి. మరోవైపు, ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్టు ఏది?.. ఆయా జట్లలో ఏ ఆటగాళ్లు కీలకంగా మారబోతున్నారు? వంటి విషయాలపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం తన ప్రపంచకప్ జట్టును ప్రకటించే ముందు.. తన జట్టులోని మొదటి ఐదుగురి పేర్లను బయటపెట్టాడు.
ఆ మొదటి ఐదుగురి ఆటగాళ్ల జాబితాలో టీమ్ ఇండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతోపాటు మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా), రషీద్ ఖాన్(ఆఫ్ఘనిస్తాన్), రబాడా(సౌతాఫ్రికా) ఉన్నారు. వీరిని ఎంపిక చేయడానికి గల కారణాన్ని కూడా ధావన్ చెప్పాడు. ‘నా మొదటి చాయిస్ విరాటే. వరల్డ్‌లో అతను బెస్ట్ బ్యాటర్. నా రెండో ఎంపిక రోహిత్. అతను చాలా అనుభవజ్ఞుడు. ఐసీసీ టోర్నీలతోపాటు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో చాలా పరుగులు సాధించాడు.
బెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన మిచెల్ స్టార్క్ కూడా నా జట్టులో ఉంటాడు. నా నాలుగో ఆటగాడు రషీద్ ఖాన్. తన మాయజాలంతో ప్రపంచకప్‌లో చాలా ప్రభావం చూపుతాడని నేను కచ్చితంగా చెబుతున్నాను. ఐదో ఆటగాడిగా రబాడాను తీసుకుంటాను. అతను ఎక్స్‌ట్రా పేస్‌తోపాటు ఎక్స్‌ట్రా బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు’ అని ధావన్ తెలిపాడు.