భారత్, విండీస్ మల్టీ ఫార్మాట్ సిరీస్ షెడ్యూల్ ఖరారు..

Update: 2023-06-12 16:30 GMT

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా వచ్చే నెలలో కరేబియన్ పర్యటనకు వెళ్లనుంది. మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో వెస్టిండీస్, భారత్ జట్టు పాల్గొననున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భారత్, విండీస్ జట్ల మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. ముందుగా జూలై 12 నుంచి 24 వరకు రెండు టెస్టులు నిర్వహించనున్నారు. జూలై 12 నుంచి 16 వరకు డొమినిక వేదికగా తొలి టెస్టు, జూలై 20 నుంచి 24 వరకు రెండో టెస్టుకు ట్రినాడాడ్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం మూడు వన్డే మ్యాచ్‌ల్లో జూలై 27, 29 తేదీల్లో తొలి రెండు వన్డేలు బార్బడోస్ వేదికగా జరగనుండగా.. ఆగస్టు 1న జరిగే ఆఖరి వన్డే‌కు ట్రినిడాడ్ వేదిక కానుంది. ఆగస్టు 3 నుంచి 13వ తేదీ వరకు ఐదు టీ20లు జరగనుండగా.. వేర్వేరు వేదికలుగా ఈ సిరీస్‌ను నిర్వహించనున్నారు.

ఆగస్టు 3వ తేదీన జరిగే తొలి టీ20కి ట్రినిడాడ్‌ ఆతిథ్యమివ్వనుంది. మిగతా నాలుగు మ్యాచ్‌లు కరేబియన్ గడ్డకు వెలుపల జరగనున్నాయి. ఆగస్టు 6, 8 తేదీల్లో జరిగే రెండు, మూడు మ్యాచ్‌లు గుయానా దేశంలో నిర్వహిస్తుండగా.. ఆగస్టు 12, 13 తేదీల్లో జరిగే చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్నాయి. కాగా, ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు బీసీసీఐ త్వరలోనే భారత జట్లను ప్రకటించనుంది. ఈ నెల చివర్లో లేదా జూలై మొదటి వారంలో టీమ్ ఇండియా క్రికెటర్లు కరేబియన్ పర్యటనకు బయల్దేరనున్నారు.


Similar News