సాత్విక్ జోడీ శుభారంభం.. నిరాశపర్చిన ప్రణయ్, లక్ష్యసేన్

మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి శుభారంభం చేసింది.

Update: 2024-01-10 16:06 GMT

దిశ, స్పోర్ట్స్ : మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి శుభారంభం చేసింది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సాత్విక్ జోడీ తొలి రౌండ్‌లో విజయం సాధించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సాత్విక్ జోడీ 21-18, 21-19 తేడాతో ఇండోనేషియాకు చెందిన ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రి-బగాస్ మౌలానా జోడీని చిత్తు చేసింది. 44 నిమిషాలపాటు నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ పోరులో ఏ మాత్రం పట్టు వదలని సాత్విక్ జంట వరుసగా రెండు గేమ్‌లను దక్కించుకుంది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి ద్వయం నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నప్పటికీ సాత్విక్, చిరాగ్‌ చివరి వరకూ ఆధిపత్యం చేయి జారనివ్వలేదు. అయితే, తొలి గేమ్‌తో పోలిస్తే రెండో గేమ్ రసవత్తరంగా సాగింది. రెండో గేమ్‌లో ఇండోనేషియా షట్లర్లు బలంగా పుంజుకున్నారు. మొదటి నుంచి ఆధిపత్యం చాటుతూ 6-2తో ఆధిక్యంలోకి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో సాత్విక్, చిరాగ్ పుంజుకుని 7-7తో సమం చేసి పోటీలోకి వచ్చారు. అయితే, ప్రత్యర్థి జంట మరింత పుంజుకు వరుస పాయింట్లు సాధించింది. ఒకదశలో 14-8తో సాత్విక్ జోడీ వెనుకబడి మ్యాచ్‌ను కోల్పోయేలా కనిపించింది. ఆ సమయంలో సాత్విక్ జోడీ పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి పోటీలోకి రావడమే కాకుండా 16-16తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత అదే జోరుతో ప్రత్యర్థులను వెనక్కినెట్టి వరుసగా రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. నేడు రెండో రౌండ్‌లో ఫ్రాన్స్‌ జోడీ లుకాస్ కార్వీ-రోనన్ లాబర్‌తో సాత్విక్ జోడీ తలపడనుంది. ఇక, పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ దారుణంగా నిరాశపరిచారు. తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. డెన్మార్క్ ప్లేయర్ అండర్స్ ఆంటోన్సెన్‌ చేతిలో 21-14, 21-11 తేడాతో ప్రణయ్ పరాజయం పాలవ్వగా.. లక్ష్యసేన్‌పై 15-21, 16-21 తేడాతో చైనా ఆటగాడు వెంగ్ హాంగ్ యాంగ్ గెలుపొందాడు. 

Tags:    

Similar News