మలేషియా ఓపెన్‌లో సెమీస్‌కు సాత్విక్ జోడీ
గత సీజన్‌లో సంచలన ప్రదర్శనతో సత్తాచాటిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తోంది.
దిశ, స్పోర్ట్స్ : గత సీజన్‌లో సంచలన ప్రదర్శనతో సత్తాచాటిన భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తోంది. తొలి టైటిల్ దిశగా దూసుకెళ్తున్నది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో సాత్విక్ జోడీ సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 21-11, 21-8 తేడాతో చైనాకు చెందిన హీ జీ టింగ్-రెన్ జియాంగ్ యును చిత్తు చేసింది. కేవలం 35 నిమిషాల్లోనే ప్రత్యర్థుల ఆట కట్టించింది. మొదటి నుంచి సాత్విక్ జోడీ దూకుడుగా ఆడింది. దీంతో చైనా ద్వయానికి కోలుకునే అవకాశం కూడా దక్కలేదు. తొలి గేమ్ పూర్తి హవా భారత జోడీదే. ఆరంభంలోనే వరుసగా 7 పాయింట్లు నెగ్గి జోరు కనబర్చిన భారత జంట అదే దూకుడుతో తొలి గేమ్‌ను నెగ్గి శుభారంభం చేసింది. రెండో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగింది. అయితే, ప్రారంభంలో చైనా షట్లర్లు పోరాడేందుకు చూశారు. స్కోరును 3-3తో సమం చేశారు. ఇక, ఆ తర్వాత ఆటంతా సాత్విక్, చిరాగ్‌లదే. చైనా జోడీ కనీసం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. నేడు జరిగే సెమీస్‌లో సౌత్ కొరియాకు చెందిన కాంగ్ మిన్ వ్యూక్-సియో సీయుంగ్ జేతో సాత్విక్ జోడీ తలపడనుంది. కాగా, గతేడాది సాత్విక్-చిరాగ్ జంట అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం, ఏషియన్ చాంపియన్‌షిప్ టైటిల్‌తోపాటు స్విస్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్, కొరియా ఓపెన్ టర్నీల్లో విజేతగా నిలిచింది.
అశ్విని జోడీ ఓటమి
భారత మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌లో భారత జోడీపై 15-21, 13-21 తేడాతో జపాన్ ద్వయం రిన్ ఇవానగా-కీ నకనిషి గెలుపొందింది. తొలి గేమ్‌ను పోరాడి కోల్పోయిన అశ్విని జోడీ.. రెండో గేమ్‌లో పుంజుకుంది. ఒకదశలో 8-4తో ముందంజలోకి వెళ్లి ఆశలు రేపింది. అయితే, జపాన్ జోడీ పుంజుకోవడంతో భారత జంట ఒత్తిడిలో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కోల్పోయింది.