Sarfaraz Khan: ఆ సైగలే సర్ఫరాజ్ ఖాన్ కొంపముంచాయా..! (వీడియో)

తాజాగా వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన టెస్ట్ టీమ్‌లో సర్ఫరాజ్‌ఖాన్‌కు అవకాశం దక్కలేదు.

Update: 2023-06-26 10:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన టెస్ట్ టీమ్‌లో సర్ఫరాజ్‌ఖాన్‌కు అవకాశం దక్కలేదు. దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్ది పరుగులు చేస్తున్నా.. భారత సెలెక్టర్లు మాత్రం ఈ యువ బ్యాటర్‌ను పట్టించుకోవడం లేదు. గత మూడు సీజన్లుగా దేశవాళీ క్రికెట్‌లో 100కు పైగా సగటుతో రన్స్ చేసినా.. సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనకు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సెలెక్టర్లను ఘాటుగా విమర్శించారు.

సర్ఫరాజ్‌ఖాన్ కూడా తనను ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన ప్రదర్శనలకు సంబంధించిన హైలైట్స్‌ను ఇన్‌స్టా స్టోరీలో పెట్టి ఒక్క మాట కూడా అనకుండానే సెలెక్టర్లకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. సర్ఫరాజ్‌ ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడగా.. 79.65 సగటుతో 3,505 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలున్నాయి. అయితే రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ సందర్భంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ అనంతరం సర్ఫరాజ్ ఖాన్ అగ్రెసివ్‌గా సంబరాలు చేసుకోవడమే అతని కొంపముంచిందని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఆ మ్యాచ్‌కు అప్పటి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ హాజరయ్యాడని, అతను కూర్చున్న వైపు ఆగ్రహంగా చూసిన సర్ఫరాజ్ తన బ్యాట్‌ను చూపిస్తూ.. ఎగతాళి సైగలు చేశాడన్నాడు. ఆ ప్రవర్తనే సెలెక్టర్లు కోపం తెప్పించిందని తెలిపాడు. అతని ఫిటెనెస్‌ విషయంలోనూ సెలెక్టర్లు సంతృప్తిగా లేరని.. స్టేడియంలో చురుకుగా కదలలేడని పక్కనపెట్టేశారని చెప్పాడు.


Similar News