సరబ్‌జోత్ సింగ్‌కు గురి అదరహో.. షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు తొలి మెడల్

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్‌ఎస్ఎఫ్) వరల్డ్ కప్‌లో భారత షూటర్ సరబ్‌జోత్ సింగ్ మెరిశాడు.

Update: 2024-06-06 13:58 GMT

దిశ, స్పోర్ట్స్ : జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్‌ఎస్ఎఫ్) వరల్డ్ కప్‌లో భారత షూటర్ సరబ్‌జోత్ సింగ్ మెరిశాడు. గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అతను 588 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరాడు. ఫైనల్‌లోనూ అతను అదే జోరు కనబరిచాడు.

8 మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్‌లో సరబ్‌జోత్ సింగ్.. ప్రస్తుత వరల్డ్ చాంపియన్ బోవెన్ జాంగ్(చైనా), ఒలింపియన్ యూసుఫ్ డికేక్(తుర్కియే)లను ఎదుర్కొన్నాడు. మొదటి నుంచి లీడ్‌లో కొనసాగిన అతను 242.7 స్కోరుతో విజేతగా నిలిచాడు. సరబ్‌జోత్ సింగ్‌కు వ్యక్తిగత కేటగిరీలో ఇది రెండో వరల్డ్ కప్ స్వర్ణం. ప్రస్తుత టోర్నీలో భారత్‌‌కు ఇదే తొలి పతకం. చైనాకు చెందిన బు షువాయ్‌హాంగ్(242.5) 0.2 పాయింట్లతో రజతంతో సరిపెట్టగా.. రాబిన్ వాల్టర్(220) కాంస్యం గెలుచుకున్నాడు.

మరోవైపు, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో మహిళల విభాగంలో సిఫ్ట్ కౌర్, పురుషుల విభాగంలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో తోమర్ 592 పాయింట్లతో 6వ స్థానంలో.. 593 పాయింట్లతో సిఫ్ట్ కౌర్ 5వ స్థానంలో నిలిచారు.



Similar News