థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్.. మెయిన్ డ్రాకు సమీర్, కిరణ్, అష్మిత
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సమీర్ వర్మ, కిరణ్ జార్జ్, అష్మిత చలిహ మెయిన్ డ్రాకు అర్హత సాధించారు.
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సమీర్ వర్మ, కిరణ్ జార్జ్, అష్మిత చలిహ మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. మంగళవారమిక్కడ జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌ల్లో వీరు వరుస సెట్లలో తమ ప్రత్యర్థులను ఓడించారు. మాజీ వరల్డ్ నంబర్ 11 సమీర్ 21-12, 21-17తో మలేసియాకు చెందిన యియో సెంగ్ జోను ఓడించాడు. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో ఇతనికి వాకోవర్ లభించింది. మెయిన్ డ్రా తొలి మ్యాచ్‌లో డెన్మార్క్‌క చెందిన మాగ్నస్ జొహన్నెసెన్‌తో తలపడనున్నాడు.
ఇక 2022 ఒడిషా ఓపెన్ విజేత కిరణ్ 21-14, 21-18తో సహచర షట్లర్ కార్తికే గుల్షన్ కుమార్‌ను, తర్వాత 21-10-21-14తో కొరియాకు చెందిన జియాన్ జిన్‌ను చిత్తు చేసిన మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మెయిన్ డ్రాలో బుధవారం చైనాకు చెందిన సి యుకితో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో అష్మిత చలిహ 21-16, 13-21, 21-19తో భారత్‌కే చెందిన ఉన్నతి హూడాపై గెలిచింది. తర్వాతి మ్యాచ్‌లో 21-19, 21-11తో ఇస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కూబను చిత్తు చేసింది. మెయిన్ డ్రాలో సహచరురాలు మల్విక బన్సూద్‌తో ఆడుతుంది. ఇంకా సాయి ప్రణీత్, మిథున్ మంజునాథ్ కూడా మెయిన్ డ్రాకు అర్హత సాధించారు.