IND VS SA : సఫారీల గడ్డపై కుర్రాళ్లు ఏం చేస్తారో?.. నేడు తొలి టీ20

టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.

Update: 2024-11-07 18:38 GMT

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ వైట్‌వాష్‌ను భారత జట్టు, భారత అభిమానులు ఇప్పట్లో మర్చిపోవడం కష్టమే. అయితే, ఆ అవమానానికి సూర్య సేన మందు పూయాలనుకుంటున్నది. టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లిన కుర్రాళ్లు సఫారీల గడ్డపై సత్తాచాటితే కొంతలో కొంత భారత్‌కు ఊరటనిచ్చినట్టే అవుతుంది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడే తొలి మ్యాచ్. డర్బన్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా.. సొంతగడ్డపై గెలుపు దీమాతో సఫారీలు బరిలోకి దిగుతున్నారు.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది. సీనియర్లు దూరంగా ఉన్న ఈ సిరీస్‌కు పూర్తిగా కుర్రాళ్లనే ఎంపిక చేశారు. పాండ్యా, సూర్య, శాంసన్, అక్షర్ పటేల్ మినహా మిగతా వారందరూ యువకులే. ఇటీవల కుర్రాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే బ్యాటింగ్, బౌలింగ్ పరంగా టీమిండియా బలంగానే కనిపిస్తోంది. శాంసన్, అభిషేక్ ఓపెనర్లుగా రానున్నారు. మిడిలార్డర్‌లో సూర్య, తిలక్, పాండ్యా, రింకు వంటి హిట్టర్లతో భారీ స్కోరు చేసే సామర్థ్యం ఉంది. ఆల్‌రౌండర్ రమణ్ దీప్ సింగ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అక్షర్ పటేల్‌కు తోడు మరో స్పిన్నర్ కోటా కోసం వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ మధ్య పోటీ నెలకొంది. అలాగే, పేస్ దళాన్ని అర్ష్‌దీప్ సింగ్ నడిపించనుండగా.. అవేశ్ ఖాన్, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్ పోటీ పడుతున్నారు. అవేశ్ ఖాన్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది. డర్బన్‌లో టీ20ల్లో భారత్‌కు మంచి రికార్డే ఉండటం ఆత్మవిశ్వాసం పెంచేదే. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ నెగ్గింది. అయితే, సొంతగడ్డపై సఫారీలను ఓడించడం అంత సులభం కాదు. గత ఏడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, సౌతాఫ్రికా జట్టు కూడా సీనియర్లు, యువకులతో పటిష్టంగా ఉంది. మార్‌క్రమ్, స్టబ్స్, మిల్లర్, క్లాసెన్‌లతో కూడిన ఆ జట్టు బ్యాటింగ్ దళాన్ని భారత బౌలర్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి. అలాగే, కేశవ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జి, బార్ట్‌మన్ వంటి బౌలర్లు టీమిండియా బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు.

వర్షం ముప్పు!

తొలి టీ20కి వర్షం ముప్పు పొంచి ఉన్నది. శుక్రవారం డర్బన్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణ నివేదిక ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం నేడు రాత్రి 7 గంటలకు వర్షం పడొచ్చు. ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువకానుంది. దీంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

పేసర్లకు అనుకూలం

డర్బన్ పిచ్ పేసర్లకు అనుకూలమని నివేదికలు అంచనా వేశాయి. పిచ్‌పై పేస్, బౌన్స్ కలిగి ఉండటం సీమర్లకు ఉపయోగపడనుంది. ఇది బ్యాటర్లను ఇబ్బంది పెట్టనుంది. అయితే, మ్యాచ్ జరుగుతున్న కొద్ది బ్యాటర్లకు ప్రభావం చూపనున్నారు. డర్బన్‌లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 136. 9 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు నెగ్గగా.. 8 మ్యాచ్‌ల్లో చేజింగ్ జట్టు విజయం సాధించింది.

భారత్ 15.. సౌతాఫ్రికా 11

టీ20ల్లో ఇప్పటివరకు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఆసక్తికర పోరే సాగింది. టీమిండియాదే కాస్త పైచేయి. ఇప్పటివరకు ఇరు జట్లు 27 సార్లు ఎదురుపడ్డాయి. అందులో భారత్ 15 విజయాలు నమోదు చేసింది. సౌతాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

తుది జట్లు(అంచనా)

భారత్ : సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రమణ్‌దీప్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్.

సౌతాఫ్రికా : ర్యాన్ రికెల్టన్, హెండ్రిక్స్, మార్‌క్రమ్(కెప్టెన్), స్టబ్స్, డేవిడ్ మిల్లర్, క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, బార్ట్‌మాన్, గెరాల్ట్ కోయెట్జీ.

Tags:    

Similar News