Ranji Trophy 2024-25 : మహారాష్ట్ర రంజీ టీమ్ కెప్టెన్‌గా రుతురాజ్

Update: 2024-07-25 13:22 GMT

దిశ,స్పోర్ట్స్ : భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర రంజీ జట్టు కెప్టెన్‌గా నియామకమయ్యాడు. రాబోయే రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో మహారాష్ట్ర జట్టుకు రుతురాజ్ గైక్వాడ్‌ను సారథిగా నియమించినట్టు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గురువారం ప్రకటించింది. అలాగే, 28 మందితో కూడిన జట్టును వెల్లడించింది. మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ సులక్షణ్ కులకర్ణి హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. గత సీజన్‌లో జట్టును కేదార్ జాదవ్ నడిపించగా.. జూన్‌లో అతను క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

ఇప్పటికే లిస్ట్ ఏ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టుకు గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే, అతని నాయకత్వంలో భారత జట్టు గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఐపీఎల్‌లో ఈ ఏడాది చెన్నయ్ సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టగా.. చెన్నయ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో సత్తాచాటిన గైక్వాడ్.. టీమిండియా సిరీస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, అతన్ని శ్రీలంక పర్యటనకు సెలెక్టర్లు పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది.

ఈ తరుణంలో మహారాష్ట్ర రంజీ టీమ్ కెప్టెన్‌గా నియామకమవడం రుతురాజ్‌కు ఊరటనిచ్చే విషయం. మరోవైపు, గత సీజన్‌లో మహారాష్ట్ర ఎలైట్ గ్రూపు ఏలో ఒక్క విజయం మాత్రమే సాధించి 7వ స్థానంతో సరిపెట్టింది. అక్టోబర్ 11 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు రంజీ ట్రోఫీ 2024-25 జరగనుంది. ఎలైట్ ఏ గ్రూపులో మహారాష్ట్ర తొలి మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్‌తో తలపడనుంది. 

Tags:    

Similar News