జడేజాకు రూట్ క్లియర్
మోకాలికి సర్జరీ కారణంగా దాదాపు ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది.
బెంగళూరు : మోకాలికి సర్జరీ కారణంగా దాదాపు ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. తాజాగా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) జడేజా పూర్తి సంసిద్ధంగా ఉన్నట్టు ఫిట్‌నెస్ రిపోర్టు ఇచ్చింది. దాంతో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున జడేజా బరిలోకి దిగి సత్తాచాటాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల ప్రదర్శన చేసి తానెంటో నిరూపించుకున్నాడు.
దాంతో నాగ్‌పూర్ వేదికగా ఈ నెల 9న ప్రారంభమయ్యే తొలి టెస్టు నుంచే అతను జట్టుకు అందుబాటులో ఉండటంతో టీమ్ ఇండియాకు అదనపు బలం చేకూరినట్టే. గతేడాది ఆగస్టులో జరిగిన ఆసియా కప్‌లో జడేజా మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. అలాగే, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొలి టెస్టు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. వెన్నునొప్పితో న్యూజిలాండ్ సిరీస్ నుంచి వైదొలిగిన అయ్యర్ ఇంకా పూర్తిగా కోలేకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతను బెంగళూరులోని ఎన్‌సీఏలో కోలుకుంటున్నాడు. అయ్యర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Read more: