ఇంగ్లాండ్‌ను ఆదుకున్న రూట్.. ఆరంభాన్ని కొనసాగించలేకపోయిన భారత బౌలర్లు

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం రాంచీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభమైంది.

Update: 2024-02-23 12:26 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం రాంచీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లను కోల్పోయి 302 పరుగులు చేసింది. జోరూట్ అజేయ శతకంతో క్రీజులో పాతుకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరుపై కన్నేసింది. మొదట్లో మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉంది. బుమ్రా గైర్హాజరులో పేసర్ ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటిన ఆకాశ్ దీప్ ఆరంభంలోనే ఇంగ్లాండ్‌ను దెబ్బ మీద దెబ్బ కొట్టారు. ఒకే ఓవర్‌లో ఓపెనర్ బెన్ డక్కెట్(11)తోపాటు ఓలీ పోప్(0)లను అవుట్ చేశాడు. వరుస ఓవర్‌లో దూకుడుగా ఆడుతున్న జాక్ క్రాలీ(42)ని సైతం పెవిలియన్ పంపాడు. తన రెండో ఓవర్‌లోనే జాక్ క్రాలీని ఆకాశ్ దీప్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే, నో బాల్ కావడంతో జాక్ క్రాలీ బయటపడ్డాడు.

57 పరుగులకే టాప్-3 వికెట్లు కోల్పోయి ఇంగ్లాడ్ తడబడింది. ఆ తర్వాత బెయిర్ స్టో(38)ను అశ్విన్, బెన్‌స్టోక్స్(3)ను జడేజా అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ తొలి సెషన్‌లోనే 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జోరూట్ జట్టుకు అండగా నిలిచాడు. మరోవైపు, భారత బౌలర్లు కూడా రూట్‌ను కట్టడి చేయలేకపోయారు. క్రీజులో పాతుకపోయిన రూట్ శతకం బాది అజేయంగా నిలిచాడు. రూట్ సెంచరీకి 219 బంతులు తీసుకోవడం గమనార్హం. బెన్ ఫోక్స్(47), ఓలీ రాబిన్సన్(31 బ్యాటింగ్)లతో కలిసి అతను విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఇంగ్లాండ్ తొలి రోజు ముగిసే సమయానికి 300 పరుగుల మార్క్‌ను దాటింది. రూట్(106 బ్యాటింగ్)‌తోపాటు ఓలీ రాబిన్సన్ క్రీజులో ఉన్నారు. తొలి రోజు భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 3 వికెట్లతో సత్తాచాటాడు. మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయగా.. జడేజా, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.


Tags:    

Similar News